ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ఆదేశించింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌తో ముగిసిందని గుర్తు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. వీటితో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడాది ఆగస్టు 20న జారీ చేసిన జీవో 105, పురపాలకశాఖ ఆగస్టు 19న జారీ చేసిన జీవో 1065లు చట్టం ముందు నిలబడవని, వాటిని కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
వికాశ్ కిషన్రావ్ గవాలి కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీసీ జనగణన, వారి స్థితిగతులపై డేటా సేకరణ ప్రక్రియను పూర్తి చేసి జనహిత్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా 50శాతానికి మించి రిజర్వేషన్ల కల్పన అంశాన్ని పునఃపరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. జీవోలను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రిజర్వేషన్ పరిమితి 50 శాతం దాటకూడదనే నిబంధన లేదని జన్హిత్ అభియాన్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనప్పటికీ ఆ పరిమితి దాటాలంటే శాస్త్రీయ డేటా ఆధారంగా మాత్రమే సాధ్యమౌతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించింది. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రం నియమించిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ సైతం సమగ్ర కుటుంబ సర్వే డేటాపైనే ఆధారపడింది. ఆ కమిషన్ నివేదిక ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ఆమోదం పొందలేదు.
సర్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 2026 జనవరి 1నాటికి అందుబాటులో ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పురపాలకశాఖ చట్టాల్లోని సెక్షన్ 11, మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 12లోని నిబంధనలు పాటించాలని ఎస్ఈసీకి స్పష్టం చేసింది.
సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను ధర్మాసనం కొట్టివేసింది. వార్డులు పునర్విభజన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
కాగా, బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు బాపట్ల జిల్లా రేపెల్లె ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ విషయం గురించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా సీనియర్ న్యాయనిపుణులతో ముఖ్యమంత్రి చర్చించి దీనిపై వచ్చే సోమవారంలోపు పిటిషన్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

More Stories
కోల్‌కతా విమానాశ్రయం మసీదులో ప్రార్థనలకు అనుమతి నిరాకరణ
తీవ్రవాద ఇస్లామిస్ట్ భావజాల ప్రభావంలో ఫ్లైదుబాయ్ కో-పైలట్
కర్ణాటక అసెంబ్లీలో ఉర్దూ ఉత్సవంపై బిజెపి, కన్నడ సంఘాల అభ్యంతరం