ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అక్టోబర్ 7న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికారికంగా ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, ఆ తర్వాత 2014 నుంచి దేశ ప్రధానమంత్రిగా సమర్థవంతమైన, జనరంజక పాలన అందిస్తూ నిరంతర ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించే అంశాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఎంపీ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానాన్ని కేవలం సాంప్రదాయ వేడుకలకే పరిమితం చేయకుండా ‘సేవ’ కార్యక్రమాల ద్వారా సామాజిక ప్రయోజనం చేకూర్చాలని లింగమనేని రమేశ్ సూచించారు. వివిధ మత సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని చాటిచెబుతాయని ఎంపీ పేర్కొన్నారు.

More Stories
సంఘ్ జేష్ఠ కార్యకర్త దోనేపూడి వెంకయ్య మృతి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత
తిరుపతి ఎయిర్పోర్ట్ ప్రైవేటుకు అప్పగింత