సంఘ్ జేష్ఠ కార్యకర్త దోనేపూడి వెంకయ్య మృతి

 
రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో దీర్ఘకాలం సేవలందించిన అంకితభావం కలిగిన స్వయంసేవకులు, సంఘ కార్యానికి, సంఘ సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవలు అందించిన దోనేపూడి వెంకయ్య (91) బుధవారం సాయంత్రం పరమపదించారు.  తృతీయ వర్ష శిక్షిత్‌గా, వెంకయ్య సంఘ కార్యాన్ని జీవితంలో ఒక సాధనగా స్వీకరించి, సేవ, సాహిత్యం, కార్యకర్త నిర్మాణం అనే మూడు రంగాల్లో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన  జీవితం, సేవలు తరతరాల స్వయంసేవకులకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
సంఘ కార్యంలో భాగంగా కృష్ణా, గుంటూరు విభాగాల్లో విభాగ బౌద్ధిక్ ప్రముఖ్‌గా, ప్రచారక్‌గా  బాధ్యతలు నిర్వహించి, సంఘ విస్తరణకు, కార్యకర్తల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. హైదరాబాద్‌లోని శారదాధామ్‌లో ఒక సంవత్సరం పూర్తి సమయ ప్రచారక్‌గా  కూడా సేవలందించారు. సంఘ సాహిత్య రంగంలో కూడా ఆయన సేవలు విశిష్టమైనవి. 
 
“సద్గుణ సంపద” వంటి రచనలతో పాటు, సంఘ ప్రచురణల ద్వారా ప్రచురితమైన సంఘ ప్రార్థనకు తెలుగు వచనం వంటి ముఖ్యమైన రచనలను అందించారు. సంఘ భావాలను, విలువలను సరళమైన భాషలో సమాజానికి చేరువ చేయడంలో ఆయన రచనలు ఉపయోగపడ్డాయి. సంఘ ప్రార్థన గురించి విపులమైన వ్యాఖ్యానం వ్రాశారు. గత యాబై సంవత్సరాలలో ఈ పుస్తకం ఇరవై పైన ముద్రణలు పొంది ఉంటుంది.
దీనితోపాటు ఆయన రచించిన మరొక గ్రంథం సద్గుణ సంపదను కూడా పాఠ్యగ్రంథంగా పేర్కొనవచ్చు. ఇది మొదట నాలుగు భాగాలుగా ముద్రింపబడిన తర్వాత ఒకే బృహద్గ్రంథ రూపాన్ని సంతరించుకొని అనేక ముద్రణలు పొందింది. దీనానాథ్ బత్రా  హిందీలో సేకరించి ప్రచురించిన ప్రేరణదీప్ గ్రంథావళిని తెలుగులోకి అనువదించారు. బాల సాహిత్యంలో వాటికి ఒక ప్రత్యేక స్థానముంది.
మార్క్సిజమా? మానవతా వాదమా? అనే వ్యాసావళిని జాగృతి పత్రికకు సుదీర్ఘకాలం వ్రాశారు. ఆ వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి. మార్క్సుకు పాఠాలు అనే లఘు వ్యాసావళిని కూడా జాగృతి కొరకు వ్రాశారు. ప్రతి వ్యాసంలోనూ ఒక పద్యం ఉంటుంది. ఇవి రెండు భాగాలుగా ప్రచురితమయ్యాయి. భారతి పత్రికకు చాలా వ్యాసాలు వ్రాసారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఆయన రచనలు ప్రసారమయ్యాయి.
‘భీష్మ యుధిష్టర సంవాదం’ కూడా జాగృతిలో వరుసగా ప్రచురితమై ఆ తర్వాత పుస్తకరూపంలో వచ్చింది. అనేక ముద్రణలు పొందింది. జాతీయ సాహిత్య పరిషత్ వెలువరించిన హిరణ్య గర్భ కవితల సంకలనంలో చోటు సంపాదించిన వ్రత దీక్ష, అమ్మ కవితలు వచన కవిత ప్రక్రియకు నమూనాగా పేర్కొనదగినవి. జాగృతి పత్రికకు ఎన్నో కవితలు వ్రాశారు, పద్య కథలు వ్రాశారు.
అరుణాచల యోగి గా ప్రసిద్ధుడైన శ్రీ రమణ మహర్షి సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకొని రావటంలో ఆయన పాత్ర అసమానమైనది. ఇరవైకి పైగా పుస్తకాలను వ్రాశారు. రమణ మహర్షి బోధలను, ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని, వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడానికి సంస్కృతంలో వాడుకలో ఉన్న అనుష్ఠుప్ చందస్సును తెలుగులోకి తీసికొనివచ్చారు. ఇలా తెలుగు సాహిత్య రంగానికి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి, రమణ సందేశ వ్యాప్తికి సేవలందించిన దోనేపూడి వెంకయ్య మరణం ఒక తీర్చలేని లోటును మిగిలిస్తుంది.
వారి పవిత్ర స్మృతికి జాగృతి మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత డా. వడ్డీ విజయ సారధి భావపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

       

About The Author