నాగోల్‌లో యువమోర్చ మెగా రక్తదాన శిబిరం

నాగోల్‌లో యువమోర్చ మెగా రక్తదాన శిబిరం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నాగోల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొంటూ  ప్రధాని నరేంద్ర మోదీ సేవలకు దేశం గుర్తింపు ఇస్తోందన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా మోదీ అందించిన సేవలు దేశ అభివృద్ధిలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. 
ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను పెంచడంలో మోదీ కీలక పాత్ర పోషించారని ఈటల చెప్పారు.  కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆయన సేవలను గుర్తిస్తున్నారని తెలిపారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, ఆధునిక రైల్వే వ్యవస్థ, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.

2014కు ముందు మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పరిమితంగా ఉండగా.. ప్రస్తుతం భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తూ దేశ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తనను పాలకుడిగా కాకుండా ప్రజల సేవకుడిగా భావిస్తారని అన్నారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న మోదీ మరింత ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే ప్రజాప్రతినిధికి నిజమైన సంతృప్తినిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు.  రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు, రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే రాజకీయ నాయకత్వానికి అసలైన పరమార్థమని స్పష్టం చేశారు.

ప్రతి రాజకీయ నాయకుడి ఆలోచనా విధానంలో ప్రజాసేవ అంతర్భాగం కావాలని, సమాజానికి మేలు చేసినప్పుడే అంతర్గతంగా నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు,  వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీక రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.