రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు చిన్నారులు మృతి

రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు చిన్నారులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి అయిదు రోజుల శిశువు మృతి చెందింది. వార్డులో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించడంతో  వార్డుకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. అందులోని పిల్లలను సిబ్బంది పక్క వార్డుకు తరలించారు. గాయాలైన పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మరో ఇద్దరు శిశువులు మృతి చెందారు.  మిగిలిన 23 మంది పిల్లల్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు అధికారులు, వైద్యులు తెలిపారు
 
రిమ్స్‌లో ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహ తెలిపారు. మంగళవారం రిమ్స్‌లో ప్రమాదం జరిగిన వార్డును పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ రాజర్షిషా, రిమ్స్ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.  రిమ్స్‌లో ఎలక్ట్రికల్,ఫైర్,సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.  
 
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న మిగిలిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు. 
రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేద మధ్య తరగతి ప్రజలకు ప్రాణదారంగా ఉండాలని పేర్కొంటూ ప్రభుత్వం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీ వేసి న్యాయవిచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలను ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.