వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మితమైన వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయంలోని చారిత్రక కట్టడాలు, విగ్రహాల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కోటిలింగాలు, హనుమాన్, కాలభైరవ స్వామి విగ్రహాలతో పాటు సోమేశ్వర, మహేశ్వర, బాల త్రిపుర సుందరి, నాగరాజు మండపాలను తొలగించారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంటూ వీటిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆలయ పునరుద్ధరణ కోసం రూ. 240 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం, టెండర్ల ద్వారా ఇప్పటివరకు రూ. 55 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోందని చెబుతూ నిధుల ఖర్చు, పనుల పురోగతిపై పారదర్శకత లేదని విమర్శించారు. గతేడాది నవంబర్ 12 నుండి రాజన్న దర్శనాలను నిలిపివేసి కేవలం భీమేశ్వర స్వామి దర్శనాలకే పరిమితం చేశారని, ఇప్పుడు గోపుర శిఖరాన్ని కూడా తొలగించడంతో భక్తులకు కనీసం శిఖర దర్శనం కూడా లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా, ప్రాచీన ఆలయాల పునర్నిర్మాణంలో సంప్రదాయబద్ధంగా కృష్ణశిలను వాడాల్సి ఉండగా, కాంక్రీట్ కట్టడాలు నిర్మించడం ఆలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడమేనని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని, అయితే అది శాస్త్రీయంగా, ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ప్రణాళికాబద్ధంగా జరగాలని డాక్టర్ వికాస్ రావు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో వేములవాడ ఆలయ పునరుద్ధరణ మాస్టర్ ప్లాన్ పూర్తి వివరాలను, ఇప్పటివరకు జరిగిన ఖర్చులు, పనుల పురోగతిపై తక్షణమే ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాచీన కట్టడాలు, మండపాలు, విగ్రహాల ప్రస్తుత పరిస్థితిపై భక్తులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆలయ మార్పులపై శృంగేరి పీఠం నుండి వచ్చిన సూచనలు, స్థానిక అర్చకులు, దేవాదాయ శాఖ ఇచ్చిన లిఖితపూర్వక అనుమతులను బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు.
భక్తులలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ఆలయ సందర్శనకు అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, ఆలయ ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి భంగం కలగకుండా పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

More Stories
డ్రగ్స్ రహిత భారత్ కోసం చేతులు కలిపిన ‘బాహుబలి’
పాతబస్తీలో మైనర్లను వివాహం పేరుతో ఎర వేస్తున్న దళారులు
‘నషా ముక్త్ భారత్’ దిశగా సమష్టి పోరాటానికి పిలుపు