‘నషా ముక్త్ భారత్’ దిశగా సమష్టి పోరాటానికి పిలుపు

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని, దేశ భవిష్యత్తు కోసం మనమందరం కలిసికట్టుగా పోరాటం చేసి ‘నషా ముక్త్ భారత్’ (డ్రగ్స్ రహిత భారత్) దిశగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం మనమందరం గొంతు విప్పుదాం.. అనే నినాదంతో నిర్వహిస్తున్న “హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్” కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం కవాడిగూడలోని సి.జి.ఓ. టవర్స్ లో జరిగిన ప్రత్యేక ‘ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీట్’లో పాల్గొన్నారు. 
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో నేటి తరం డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి మీ వేదికలకు ఉందని, యువతలో చైతన్యం నింపి వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వాల చర్యలతోనే కాకుండా, ప్రజలందరి భాగస్వామ్యంతోనే డ్రగ్స్ రహిత భారత్ సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు.
నగరానికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ క్రియేటర్లు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. “మీ గొంతు, మీ ప్రభావం, మన బాధ్యత”  అనే స్ఫూర్తితో ఈ సామాజిక ఉద్యమాన్ని యువతలోకి బలంగా తీసుకెళ్తామని ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అంతకు ముందు మన దేశానికి అతిపెద్ద ఆస్తి యువతేనని, కానీ వారు మాదకద్రవ్యాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పంజాబ్‌ను డ్రగ్స్ నిర్వీర్యం చేసిందని పేర్కొంటూ ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ చలామణి అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్కు బానిసలైన యువత మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 
హైదరాబాద్‌లోని మేధావులు, ఐటీ నిపుణులు, యువత డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని శ్రీసత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ మెగా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ పిలుపిచ్చారు. మనదేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుతం యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు పేర్కొన్నారు. మన దేశ యువతను నాశనం చేసేందుకు విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయని అందులో భాగంగా సరిహద్దుల్లో ఉండే వారిని డ్రగ్స్కు బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శాసనసభాపక్ష (బీజేఎల్పీ) నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం డ్రగ్స్ సరఫరా వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. 

About The Author