పార్టీ ఫిరాయింపుల కేసులో ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయగా, సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పిటిషన్ ఇవాళ గురువారం విచారణకు రాగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వ్యక్తిగతంగా వేరే పార్టీలో చేరితో తప్పు కాదని, పదవితో పాటే చేరితే పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మళ్లీ ఎన్నికలకు వెళ్లండని దానంకు సూచించింది. అనంతరం పిటిషన్‌ను కొట్టేసింది.
దీంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాత ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు కానుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుగా పరిగణించాలంటూ అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్ వద్ద దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 2026 మార్చి 11న పిటిషన్లను కొట్టివేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ అభిప్రాయపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసింది.
సెప్టెంబర్ 18న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టి దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. అంతేకాద ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కూడా హైకోర్టు ప్రకటించింది.
హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయకుండా నిలిపివేసి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలన్న దానం నాగేందర్ తరఫు అభ్యర్థనను కూడా ధర్మాసనం అంగీకరించలేదు. తీర్పు ప్రతిని అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి పంపించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాత దానం నాగేందర్ సెప్టెంబర్ 19న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించానని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా కూడా ప్రజల మధ్యనే ఉండి ఎన్నికలకు సిద్ధం అవుతానని స్పష్టం చేశారు. అయితే మళ్లీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా అప్పుడు టికెట్ వచ్చినంక చెప్తానని, ఇప్పుడేం చెప్పాలంటూ దాటవేశారు.
బిజెపి చేసిన న్యాయపోరాటంతోనే ఈ విజయం
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ విజయం అని పేర్కొంటూ బి జె ఎల్ పి చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందని బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో న్యాయపోరాటం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఫిరాయింపుల నిరోదక చట్టాన్ని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం కంచే చేను మేసిన వైనాన్ని తలపించిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ను ప్రోత్సహించి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తోటి రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్వాగతించారు.ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు దక్కిన చారిత్రక విజయం అని పేర్కొంటూ ప్రజాస్వామ్యంలో ఎంతటివారైనా రాజ్యాంగానికి తలవంచాల్సిందేనని అని స్పష్టం చేశారు.
దానం నాగేందర్ అనర్హత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనమని బీజేపీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలకు చట్టం ముందు సమాధానం లభించిందని వ్యాఖ్యానించారు.

More Stories
‘ఓట్ల చోరీ’ ఆరోపణలను తిరస్కరించిన బిజెపి
ఒడిశా..పునరుడేశ్వరి, తమిళనాడు..రాంమాధవ్, తెలంగాణ.. బన్సల్
దిగొచ్చిన సర్కార్.. జూరాలకు కుడి, ఎడమ కాలువకు నీటి విడుదల