ఆపరేషన్ పోలోలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ బీజేపీకి తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘన నివాళులు అర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న యుద్ధ ట్యాంక్ దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరవీరుల స్మారకార్థం పుష్పాంజలి ఘటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. సర్దార్ పటేల్ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి నిర్ణయాత్మకంగా నిలిచిందని తెలిపారు. ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువకూడదని చెప్పారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టమని ఎంపీ డా.కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజాం, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారని తెలిపారు. విమోచన చరిత్రను రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఈ చరిత్ర ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, భావితరాలకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయాల్సిన చారిత్రక బాధ్యత అని స్పష్టం చేశారు.
తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విమోచన కమిటీ చైర్మన్ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటం, భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో తెలంగాణ విమోచన చరిత్రలో కీలక ఘట్టాలని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు చాటిచెప్పడమే తెలంగాణ విమోచన కమిటీ ప్రధాన లక్ష్యమని కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి తెలిపారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంలో ఆపరేషన్ పోలో కీలక పాత్ర పోషించిందని పెర్కోన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని చారిత్రక స్ఫూర్తితో నిర్వహిస్తూ, అమరవీరుల త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ విమోచన కమిటీ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తుందని శ్రీ వర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ పోలోలో సేవలందించిన రిటైర్డ్ ఆర్మీ జవానులను డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. దేశ రక్షణకు సైనికులు చేసిన సేవలను కొనియాడారు.

More Stories
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు వేగంగా అడుగులు
తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం
ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు