డంప్‌ యార్డు, పారిశ్రామిక వ్యర్థాలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి

జవహర్‌నగర్‌ ప్రాంతంలో డంప్‌ యార్డు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల తలెత్తుతున్న పర్యావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజిగిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. జన సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు ఘట్‌కేసర్‌ మండల కేంద్రంలో ఆయన పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. 

స్వచ్ఛమైన గాలి, నీరు పొందడం ప్రజల హక్కు అని, ఆ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. జవహర్‌నగర్‌ డంప్‌ యార్డు సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈటల రాజేందర్‌ విమర్శించారు. కోర్టు తీర్పులను అమలు చేయకపోవడం వల్లే సమస్య కొనసాగుతోందని ఆరోపించారు. 

న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చాయని, పర్యావరణ నిపుణులు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఘట్‌కేసర్‌లో ఫ్లైఓవర్‌ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

నిధుల కొరత కారణంగా కాంట్రాక్టర్‌ పనులు చేయడం లేదని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. ప్రాంతంలోని కొన్ని ఫ్యాక్టరీలు వ్యర్థాలను వాగుల్లో కలుపుతున్నాయని స్థానికులు ఎంపీకి వివరించారు. జవహర్‌నగర్‌ డంప్‌ యార్డు నుంచి వెలువడే మురుగు, వ్యర్థాల కారణంగా నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెత్త నుంచి వెలువడే లీచెట్‌ వల్ల తాగునీటి నాణ్యత దెబ్బతింటోందని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో కేసు వేసినట్లు ఆయన తెలిపారు. అప్పట్లో జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ డంప్‌ యార్డును తొలగించాలని ఆదేశించినట్లు పేర్కొంటూ, ఆ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలు పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలని, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని పురుషోత్తం రెడ్డి కోరారు. గాలి, నీటి కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అయినప్పటికీ, ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈటల రాజేందర్‌ చేస్తున్న పాదయాత్రకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

About The Author