వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడులతో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సమావేశమై ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడంతో పాటుగా ఈ కార్యాచరణను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రక్షణశాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ ఆఫీసర్‌ను వచ్చే వారంలోగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీంతోపాటుగా జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన డిపిఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటుగా ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారమయ్యే దిశగా ఇప్పుడు కీలక ముందడుగు పడింది.
ఉత్తర తెలంగాణ కనెక్టివిటీ విషయంలో, దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ రీజనల్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అంశాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి కిషన్ రెడ్డి తీసుకెళ్లాను. దీనిపై స్పందించిన రాజ్‌నాథ్, ఆదిలాబాద్ లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ను అభివృద్ధి చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
కాగా, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు సంబంధించి రక్షణ, పౌర విమానయాన అధికారులు ఏప్రిల్ 17న ఆదిలాబాద్ వియానాశ్రయ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంలో 2.75 కిలోమీటర్ల రన్ వే నిర్మాణం అవసరమని నిర్ణయించారు. దీంతోపాటుగా ఐఏఎఫ్ వద్ద 369.45 ఎకరాల భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్, వెదర్ షెల్టర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్స్, ఆపరేషనల్ కాంప్లెక్స్, ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెయింటేనెన్స్ ఇన్‌ఫ్రా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
పౌర సేవలకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ఒక సివిల్ టెర్మినల్‌తో పాటు నిర్వహణ, రిపేర్ల సదుపాయంను ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు అక్కడ పనిచేసే ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి అవసరమైన నివాస, ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు.
More Stories
తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం
ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
బొల్లారం రెజిమెంట్ లో చోరీ ఆయుధాలు స్వాధీనం