ఈ నెల 10వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ భూ దోపిడిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తొలి విడతగా 10-15 కీలక కేస్ స్టడీలను, డాక్యుమెంటరీ ఆధారాలను బట్టబయలు చేస్తామని బీజేఎల్పీ నేత లేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అనంతరం రెండో విడత పీపీటీని కూడా విడుదల చేస్తామని తెలిపారు. 22ఏ, ధరణి, భూభారతి ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామని, అదే వేదికగా ఈ భూదోపిడీపై బీజేపీ చేపట్టబోయే భవిష్యత్ ప్రజా పోరాట కార్యాచరణను కూడా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల దోపిడీపై నిత్యం బాధితుల నుంచి వందలాది ఫోన్ కాల్స్, పక్కా ఆధారాలు బీజేపీకి అందుతున్నాయని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల భూకుంభకోణాలపై దాదాపు 200 కేస్ స్టడీలను సేకరించి, పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేశామని తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ మైకులు కట్ చేసి గొంతు నొక్కి ఉండవచ్చు కానీ, ప్రజాక్షేత్రంలో వీరి దోపిడీని ఆధారాలతో ఎండగట్టడం ఖాయమని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వంలో భూమాఫియా విచ్చలవిడిగా బరితెగించిందని, రెండు రోజుల క్రితం కూకట్‌పల్లి సర్వే నంబర్ 1007లో రూ.50 వేల కోట్ల విలువైన భూమిని కాజేయడానికి అధికార పార్టీ బినామీ కంపెనీ ప్రహరీ గోడ కట్టే దుస్సాహసానికి ఒడిగట్టిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అక్కడ 1961లో ఏర్పాటైన ఒక సొసైటీకి చెందిన భూముల్లోని 1400 కుటుంబాల ప్లాట్లను, వారి కాంపౌండ్ వాల్స్‌ను జేసీబీలతో దౌర్జన్యంగా కూలగొట్టారని మండిపడ్డారు.
ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి స్వయంగా తాము ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల గోడు విన్నామని తెలిపారు. ప్రభుత్వంతో సంబంధం లేని లీగల్ ప్రైవేట్ ఆస్తులను సైతం అధికార పార్టీ బినామీ కంపెనీలు కబ్జా చేస్తుంటే రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన నడుస్తోందో స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన పెద్దలు.. ఇప్పుడు ప్రైవేట్ స్థలాలను సైతం ‘ల్యాండ్ హీస్ట్’ వెబ్ సిరీస్ తరహాలో గద్దల్లా తన్నుకుపోతున్నారని ధ్వజమెత్తారు.
ధరణిపై చేపట్టిన ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు తొక్కిపెట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ దోపిడీని బయటపెడితే తమ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ పాపాలను కప్పిపుచ్చుతూ, చీకటి ఒప్పందాలు, లోపాయికారీ అవగాహనలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు సీఎం కుటుంబ ఆస్తుల చిట్టాను బయటపెడితే, ముఖ్యమంత్రి స్వయంగా కేటీఆర్ ఆస్తుల చిట్టాను బయటపెట్టారని, అయితే వీరు పరస్పరం బయటపెట్టుకున్నది అసలు దోపిడీలో కేవలం ఒక శాతం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణాల పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే తక్షణమే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ప్రజాబాహుళ్యంలో ఉంచాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని, ఎవరు ఎంత దోచుకున్నారంటూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆస్తుల చిట్టాలు బయటపెట్టుకుంటుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన దోపిడీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల రూపాయల భూదోపిడీపై భారతీయ జనతా పార్టీ ఆది నుంచీ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
More Stories
ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్వర్క్ కలకలం
25 ఏళ్ల మోదీ ప్రస్థానం అధికారం నుంచి అభివృద్ధి దిశగా..
భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన