నీటి వాటాలపై ఏపీ-తెలంగాణ హోరాహోరీ

నీటి వాటాలపై ఏపీ-తెలంగాణ హోరాహోరీ
 
ఢిల్లీలో సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ ప్రసాద్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల జలవివాద పరిష్కార కమిటీ కీలక సమావేశం జరిగింది. 2014 రాష్ట్ర విభజన నాటి నీటి లభ్యత ఆధారంగా నీటి వాటాలు తేల్చాలని, గోదావరిపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ డిమాండ్ చేయగా, పాత ప్రాజెక్టులకే రీ-ఇంజినీరింగ్ చేశామని తెలంగాణ వాదించింది. 
 
విభజన నాటికి (జూన్ 2, 2014) అందుబాటులో ఉన్న నీటిని శాస్త్రీయంగా గణించి, రెండు రాష్ట్రాలకు స్పష్టమైన నీటి వాటాలు కేటాయించిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీ 2023లో రూపొందించిన నీటి లభ్యత నివేదికను ఏపీ తీవ్రంగా ఆక్షేపించింది. కాళేశ్వరం, సీతమ్మసాగర్ వంటి ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో రీతిలో లెక్కలు వేయడం సరికాదని పేర్కొంది.
 
10 టీఎంసీల ప్రాజెక్టును 100 టీఎంసీలకు విస్తరిస్తే దాన్ని రీ-ఇంజినీరింగ్ అనలేమని, వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించి గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి చేయాలని వాదించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే 2014 కంటే ముందు ఈ ప్రాజెక్టులను చేపట్టామని, మళ్లీ నీటి లెక్కలను తిరగదోడాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది. 
 
2014 కంటే ముందు ప్రతిపాదనల్లో ఉన్న తమ ప్రాజెక్టులన్నింటికీ ఏపీ అంగీకరిస్తే, విభజన తర్వాత ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు తాము అంగీకరిస్తామని తెలంగాణ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రతిపాదించారు. నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతూ శ్రీశైలం వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ఫిర్యాదు చేయగా, తమ వాటా ప్రకారం 66:34 నిష్పత్తిలోనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని వాడుతున్నామని ఏపీ స్పష్టం చేసింది. 
 
ఈ వివాదాన్ని కృష్ణా బోర్డు ఛైర్మన్ పరిష్కరించాలని సీడబ్ల్యూసీ సూచించింది. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ ఈ ఏడాది 1,000 టీఎంసీలకు పైగా గోదావరి నీరు సముద్రంలో కలిసిందని గుర్తుచేస్తూ, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు త్వరగా ఇవ్వాలని ఏపీ కోరింది. ఈ అంశాలపై చర్చించేందుకు నెలాఖరులో మరోసారి భేటీ కానున్నారు.