రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి 

రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి 
తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ బిజెపి ప్రతినిధి బృందం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం అందజేసింది. 
 
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతమ్ రావు , టి. వీరేందర్ గౌడ్, వేముల అశోక్,  రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ, డా. కళ్యాణ్ నాయక్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే తదితరులతో పాటు నిన్నటి ఆందోళనలో పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన యువమోర్చా కార్యకర్తలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యా వ్యవస్థను ఇలా నిర్వీర్యం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కాపాడేందుకు ఫీజు బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తగిన సలహాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. 

 
దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్  ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకునేలా సలహా ఇస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. అదేవిధంగా శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలే కారణమని, అందుకే ఆ రెండు పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగకుండా ప్రజలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడం మాని, జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రత్యేక చర్చ  నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్నటి ఆందోళనలో పోలీసుల దాడి వల్ల తీవ్రంగా గాయపడి పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తక్షణమే బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం కొన్ని రోజులు వేచి చూస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని  స్పష్టం చేశారు.