బిఆర్ఎస్ ఎంఎల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెండ్‌

బిఆర్ఎస్ ఎంఎల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెండ్‌

శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇద్దరినీ సస్పెండ్‌ చేయాలని శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించిన ఛైర్మన్‌ సెషన్‌ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు. అనంతరం మండలి వాయిదా పడింది.

అంతకుముందు సభాపతి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన తాతా మధు, నవీన్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ చేసిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానం ప్రతిపాదించారు. స్పీకర్‌పై తాతా మధు, నవీన్‌కుమార్‌ రెడ్డి దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని, సభా మర్యాదలకు విరుద్ధమైన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతోందని, మహిళల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తోందని సభ తెలిపింది.

బీఆర్‌ఎస్‌ సభ్యుల అనుచిత ప్రవర్తలను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ బాధ్యత తీసుకోవాలని, శాసనసభాపతికి కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, నిబంధనలకు అనుగుణంగా మండలి ఛైర్మన్‌ చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానం చేసింది. రాజ్యాంగపరమైన అత్యున్నత పదవిలో ఉండి కూడా అవమానం ఎదుర్కోవాల్సి రావటం బాధాకరమని దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఇద్దరు మండలి సభ్యులపైనా క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తూ తీర్మానించారు.

కాగా, మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షప్​ను బీఆర్​ఎస్ సభ్యులు ఖండించారు. ఇద్దరు ఎమ్మెల్సీలను చట్ట విరుద్ధంగా సస్పెండ్‌ చేశారని శాసనమండలి ఆవరణలో బైఠాయించారు. తాతా మధు, నవీన్‌కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవంక, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్​కుమార్​రెడ్డిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఓఎస్డి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిద్దరిపై ఎస్టీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

అనంతరం ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి, పోలీసుల రిమాండ్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. నిందితులు ఇద్దరూ చెరో పదివేల చొప్పున పూచీకత్తుతో పాటు రెండేసి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.