మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ పదవి తిరస్కరించిన శారద!

మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ పదవి తిరస్కరించిన శారద!
కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు బిసి మహిళలకు నామినేటెడ్ పదవులు ఇవ్వగా, వారిలో ఒకరు ఆ పదవిని తిరస్కరించినట్లు తెలుసున్నది.  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులైన నేరేళ్ళ శారద ఆ పదవిని తిరస్కరించినట్లు తెలిసింది. గతంలో తనను కాదని గద్వాల విజయలక్ష్మికి చైర్ పర్సన్ పదవినిచ్చి, తాజాగా గద్వాలకు మరో పదవి అప్పగించి, ఆమె వదిలేసిన చైర్ పర్సన్ పదవిని తనకు అప్పగిస్తారా? అంటూ ఆమె అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
అందుకే ఆమె చైర్ పర్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించలేదని తెలుస్తోంది.  గత వారం ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ జివో జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున అప్పటి వరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేరేళ్ళ శారద తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆమె సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. చివరకు ఆమె ఆ పదవిని తిరస్కరించినట్లు తెలిసింది. 
 
ఈ విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి చెప్పారని తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని నేరేళ్ళ శారదకు అప్పగించారు. 
 
అయితే బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నర్సాపూర్ ఎమ్మెల్యే వి. సునీతా లకా్ష్మరెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి అప్పగిస్తూ క్యాబినెట్ హోదా కల్పించారు. ఆ పదవీ కాలం మొత్తం ఐదేళ్ళు ఉంటుంది. కాగా ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సునీతా లక్ష్మారెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. కమిషన్ పదవి కాలం ఐదేళ్ళలో కేవలం పదమూడు నెలలు మాత్రమే మిగిలి ఉండగా, నేరేళ్ళ శారదను నియమించిన తర్వాత కేవలం ఆ కొద్ది కాలమే బాధ్యతలు నిర్వర్తించారు.
 
పదమూడు నెలలు మాత్రమే పదవీకాలం పూర్తి చేసిన నేరేళ్ళ శారద ఆ తర్వాత మరో ఐదేళ్ళ పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరినా, ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదన్న బాధ ఆమెను కలచి వేసిందని తెలిసింది. అయితే తనకు మరో ఐదేళ్ళ పాటు చైర్‌పర్సన్ పదవి పొడిగించకుండా, గద్వాల విజయలక్ష్మికి మరో పదవి ఇచ్చి, ఆమె వదిలేసిన పదవిని తనకు కట్ట బెట్టడం వల్ల ఆమె అవమానంగా భావించారని పార్టీలో చర్చ జరుగుతున్నది.