ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు 

ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు 
గత రెండు రోజులుగా తెలంగాణ శాసనసభ, శాసనమండలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలను యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే తమ బతుకులు మారేలా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని తెలంగాణ ప్రజలు, వివిధ వర్గాల ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తారని ఆయన పేర్కొన్నారు. 
 
ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, అసెంబ్లీని ఈ రెండు పార్టీలు తమ వ్యక్తిగత దూషణలకు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న నాటకీయ రాజకీయ పరిణామాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్షానికి, పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వేలాదిగా ప్రజా సమస్యల అర్జీలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. 

లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన రూ. వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సామాన్య ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్న వివాదాస్పద ‘22ఏ’ నిషేధిత భూముల జాబితా అంశం, ఉద్యోగుల సమస్యలైన పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుతో పాటు.. రాష్ట్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాలపై సభలో చర్చించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అరాచకాల నుంచి విముక్తిని, మార్పును కోరుకుని ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే పోయిన బీఆర్ఎస్ లాగే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజాద్రోహ విధానాలను అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక తీవ్ర సమస్యలకు మూలకారణం గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలేనని నిలదీశారు. తమ పాపాలు, వైఫల్యాలు, అసమర్థత బయటపడకుండా ఉండేందుకు ఇరుపార్టీలు అసెంబ్లీని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.

పరస్పర బూతుల తిట్ల పురాణంతో, కేవలం టీఆర్పీలు, కెమెరా పబ్లిసిటీ స్టంట్ల కోసమే సభా సమయాన్ని వృధా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వెల్‌లో బీజేపీ పక్షాన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 22ఏ నిషేధిత భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నాయని రాంచందర్ రావు గుర్తుచేశారు.

ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు తమ రాజకీయ స్వార్థాన్ని, నాటకాలను పక్కనపెట్టి, మిగిలిన మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలనైనా ప్రజా సమస్యలపై చర్చించేందుకు సద్వినియోగం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.