రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు అందగత్తెల మధ్య జరిగిన ఈ పోటీలో కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ప్రతిష్టాత్మకమైన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
ఈ పోటీలకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, నటి ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ జడ్జింగ్ ప్యానెల్‌లో ఉండగా, ఈ కార్యక్రమంలో ఊర్వశి ధరించిన ప్రత్యేక గౌను ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. భారత త్రివర్ణ పతాక రంగుల స్ఫూర్తితో ఊర్వశి రౌతేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆఫ్-షోల్డర్ గౌనును ధరించింది.
నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో రూపొందించిన ఈ డ్రెస్ మధ్య భాగంలో అశోక చక్రాన్ని పోలిన డిజైన్ కూడా కనిపించింది. ఈ గౌను ద్వారా భారతీయతను ప్రతిబింబించే ప్రయత్నం చేసినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఊర్వశి డ్రెస్సింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తన గౌన్ గురించి ఊర్వశి చెబుతూ “నేను ‘నేనే భారతాన్ని’ అని చెప్పాను. అందుకే, ఈ రోజు నిజంగానే నేను భారతాన్ని అని భావిస్తున్నాను. మీరందరూ చూస్తున్నట్లుగా, జాతీయ జెండా స్ఫూర్తితో రూపొందించిన ఈ దుస్తులను నేను ధరించాను” అని స్పష్టం చేశారు. ఆమె 2015లో `మిస్ యూనివర్స్ ఇండియా’ గెల్చుకున్నారు.
“ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వద్ద ఒక మీడియా సంస్థ నన్ను అడిగినప్పుడు, ‘నేను భారత్‌ను’ అని చెప్పేటప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు; కానీ ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. నేను కాషాయం, ఆకుపచ్చ రంగుల దుస్తులను ధరించాను. దీనిని ‘దాషా’ అనే అంతర్జాతీయ డిజైనర్ రూపొందించారు” అని ఆమె తెలిపారు. “ఈ అందమైన దుస్తుల తయారీకి మూడు నెలల సమయం పట్టింది. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ ఫినాలేలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఈ గౌన్ ధరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. న్యాయనిర్ణేతగా నాకు ఇది నాలుగవ సారి, పైగా ఈ దుస్తులు ఈ రాత్రి కార్యక్రమానికి సరిగ్గా సరిపోతాయి” అని ఆమె వివరించారు.
అయితే, త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులు, అశోక చక్రం వంటి జాతీయ చిహ్నాలను దుస్తుల డిజైన్‌లో ఉపయోగించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొంతమంది నెటిజన్లు ఊర్వశి ధరించిన గౌను జాతీయ జెండా గౌరవానికి సంబంధించిన నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఇది జాతీయ పతాకాన్ని పోలిన రంగులతో రూపొందించిన ఫ్యాషన్ డిజైన్ మాత్రమేనని, దీనిని నేరుగా జాతీయ పతాకాన్ని అవమానించినట్లుగా చూడకూడదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 వేడుకలో విజేత కిరీటంతో పాటు ఊర్వశి రౌతేలా గౌను కూడా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు కారణమైంది. కొందరు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తుండగా, మరికొందరు ఆమె ఫ్యాషన్ ఎంపికకు మద్దతు ఇస్తున్నారు.

More Stories
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరేం కాదు
మంత్రి నాగేంద్ర రాజీనామాకై బిజెపి కర్ణాటక విధాన సౌధ ముట్టడి
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి.. వేధింపులతో కుటుంభం బలి