కర్ణాటక శాసన మండలికి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఏ ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (సెక్యులర్) కూటమి విజయఢంకా మోగించింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు అందుకున్న తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడం, చుక్కెదురు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
“ఇది ఎన్డీఏకు దక్కిన విజయం. కాంగ్రెస్ ప్రచారం చేసిన కథనాలన్నీ బట్టబయలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు తమకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని స్పష్టంగా చెబుతున్నారు,” అని బీజేపీ నాయకుడు అశోక్ గౌడ తెలిపారు. ఈ నెల 23న జరిగిన ఎన్నికలలో బీజేపీ ఈశాన్య ఉపాధ్యాయుల నియోజకవర్గం, ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గం, పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గాలను గెలుచుకుంది. దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్) బెంగళూరు ఉపాధ్యాయుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది.
“బీబీఎంపీ ఎన్నికల్లో ఏం జరగబోతోందనడానికి ఇది ఒక సూచన. ప్రజలను ఆకట్టుకోవడంలో తాము విఫలమవుతామని కాంగ్రెస్ ఇక్కడే గుణపాఠం నేర్చుకోవాలి. వారు కేవలం నిజానికి దూరమైన, కల్పిత కథలను మాత్రమే సృష్టిస్తారు,” అని గౌడ చెప్పారు. బెంగళూరు టీచర్స్ స్థానంలో బీజేపీ-జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ ఘన విజయం సాధించారు. ఆయనకు 10,810 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పుట్టణ్ణకు 9,902 ఓట్లు పడ్డాయి. మొత్తం 908 ఓట్ల తేడాతో రంగనాథ్ ఇక్కడ గెలుపొందారు.
ఈశాన్య టీచర్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శశీల్ జీ నమోషీ భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు మొత్తం 15, 596 ఓట్లు పడగా, ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ కు చెందిన శరణప్ప మట్టూర్ కు 12, 299 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి శశీల్ ఎన్నిక కావడం వరుసగా ఇది అయిదోసారి. ఈ నియోజకవర్గంపై ఆయనకు ఉన్న గట్టి పట్టుకు ఈ ఎన్నిక అద్దం పట్టినట్టయింది.
పశ్చిమ గ్రాడ్యుయేట్స్ సీటులో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. బీజేపీకి చెందిన ఎస్ వీ సంకెనూర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ కు చెందిన మోహన్ లింబికాయిని 24,388 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. సంకెనూర్ కు మొత్తం 33,711 ఓట్ల పడ్డాయి. మోహన్ కు పోల్ అయిన ఓట్లు 9,323 మాత్రమే. ఆగ్నేయ పట్టభద్రుల స్థానంలో, బీజేపీకి చెందిన కేఎం సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి శశి హుళికుంటె మఠంపై 18,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

More Stories
సీజేఐ సూర్యకాంత్‌కు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ బేషరతు క్షమాపణ
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ వేటను ఘనంగా ప్రారంభించిన భారత్ హాకీ
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడినట్లు కాంగ్రెస్ వీడియోలపై దుమారం