* లింగమనేని రమేశ్, ఎంపీ (రాజ్యసభ), జనసేన పార్టీ
పరమత సహనంతో మెలిగే సనాతన ధర్మాన్ని హేళన చేయడం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలకు పరిపాటిగా మారడం దురదృష్టకరం అని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పవిత్రమైన పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం సాధువుల వేషధారణతో చేసిన హేళన అత్యంత ఆక్షేపణీయం అంటూ విమర్శించారు.
సనాతన ధర్మం, పూజ్య సాధు-సంతులు, హిందూ సమాజం మనోభావాలను కించపరచేలా వీధి నాటకాలు ప్రదర్శించి యావత్ హిందూ సమాజాన్ని అవమానించారని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు సాధువుల వేషధారణలో చేపట్టిన నిరసన జుగుప్సాకరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
వీరి వేషధారణలు, హావభావాలు హిందూ మతాన్ని అవమానపరుస్తూ అహంకారపూరితంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రామాయణంలో రావణుడు సీతాపహరణం కోసం మోసపూరితంగా సాధువు వేషంలో వచ్చినట్టుగా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రజలను మోసం చేసే వేషధారణ ప్రదర్శించారని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి వారి మిత్రపక్షాలకు హిందూ వ్యతిరేక వైఖరి కొత్తేమి కాదని పేర్కొంటూ వారు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమం నాటి నుంచి సనాతన ధర్మంపై నిరంతరం విషాన్ని కక్కుతూనే ఉన్నారని రమేష్ గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేది లేదని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేసారని ఆయన తెలిపారు.
సనాతన ధర్మ పరిరక్షణకు జనసైనికులు కట్టుబడి ఉన్నారని చెబుతూ పర్లిఅమేఠీన్ ప్రాంగణంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా ఖండించారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తవడంతో అసహనంతో ఉన్న ప్రతిపక్షాలు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ తరచూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
సహనానికి మారుపేరైన సనాతన ధర్మం సహనాన్ని వీరు పరీక్షిస్తున్నారని ఆయన హెచ్చరించారు. అత్యున్నత పవిత్రమైన పార్లమెంట్లో ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికను రాజకీయ నాటకాలకు, మతపరమైన అవహేళనలకు ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని రమేష్ స్పష్టం చేశారు.
దశాబ్దాల పోరాటం, నిరీక్షణ అనంతరం భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పుతో అనంతరం రాజ్యంగబద్దంగా అయోధ్యలో రామాలయం భవ్య నిర్మాణం చేపడితే ప్రతిపక్షాలు భరించలేకుండా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రామాలయంలో విరాళాల్లో అవకతవకలపై ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి వేగవంతమైన చర్యలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.
ఏ అంశంపైనా అయినా ప్రజాస్వామ్యబద్దంగా చర్చించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడే ఉంటుందని ఆయన తెలిపారు. అయితే సనాతన ధర్మంపై కక్ష పెంచుకున్న ప్రతిపక్షాలు హిందూ ధర్మాన్ని అవమానపరుస్తూ దిగజారుడు ప్రదర్శనలు చేపట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ప్రాంగణంలో మతపరమైన ప్రదర్శనలు చేసిన ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ప్రాంగణంలో మతపరమైన ప్రదర్శనలు చేసిన ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.

More Stories
జుడోలో అస్మితా డేకు స్వర్ణం, జావెలిన్ త్రోలో నీరజ్‌కు రజతం
‘దారితప్పిన వారికి’ మార్గదర్శనం.. ప్రధాని మోదీ పిలుపు
భోగాపురం విమానాశ్రయంకు ప్రధాని మోదీ నేడే ప్రారంభోత్సవం!