ఏపీలో ఎస్ఐఆర్ ప్రకియలో పాల్గొన్న 89.22 శాతం మంది

ఏపీలో ఎస్ఐఆర్ ప్రకియలో పాల్గొన్న 89.22 శాతం మంది

ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 3.71 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు తెలిపారు. దీంతో మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన పరిశీలనలో 15 లక్షల 22 వేల మంది ఓటర్లు మృతి చెందినట్లు గుర్తించినట్లు సీఈవో తెలిపారు. అలాగే 22 లక్షల 30 వేల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిపోయారని, అందువల్ల వారు ఈ ప్రక్రియలో గైర్హాజరైనట్లు నిర్ధారణకు వచ్చామని చెప్పారు. 

మరో 7 లక్షల 37 వేల మంది పేర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదైనట్లు గుర్తించినట్లు వివరించారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల పేరును కేవలం ఒకే నియోజకవర్గంలో కొనసాగించే చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహించామని, అర్హులైన ఓటర్ల హక్కులు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు లేకపోయినా లేదా వివరాల్లో పొరపాట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అలాంటి వారు ఫారం-6 ద్వారా మళ్లీ పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 

అనంతరం అన్ని దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన విచారణలు నిర్వహించిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ప్రకటించారు. కాగా, ఎన్యూమరేషన్ పత్రాలు నింపి బీఎల్ఓలకు సమర్పించిన వారిలో ఓ కొత్త సమస్య తలెత్తింది. చాలామంది 2002 నాటి జాబితాలో తమ వివరాలను, తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోలేదు. 

అలాంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయనున్నారు. వీరు ఆధార్ కార్డుతో పనిలేకుండా ఈసీ సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.