సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువల స్థాపనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సంత్ రవిదాస్ మహారాజ్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పేర్కొన్నారు. విజయవాడలో సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల కార్యశాల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న *”సంత్ రవిదాస్ మహా అభియాన్”*లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సుమారు 650 సంవత్సరాల క్రితం జన్మించిన సంత్ రవిదాస్ ప్రతి మనిషిలో ఒకే ఆత్మ, ఒకే దైవ చైతన్యం ఉందని బోధించారని తెలిపారు. కులం, వర్ణం, మతం అనే భేదాలకు అతీతంగా మానవత్వమే పరమ ధర్మమని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. 14వ శతాబ్దంలో విదేశీ దాడులు, బలవంతపు మత మార్పిడులు ఒకవైపు, సమాజంలో కుల వివక్ష, అంటరానితనం మరోవైపు తీవ్రంగా ఉన్న సమయంలో సంత్ రవిదాస్ సమానత్వ భావనను ప్రజల్లో నాటారని తెలిపారు.
వివక్షను స్వయంగా అనుభవించినప్పటికీ ద్వేషాన్ని కాకుండా ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక సమరసతనే తన జీవిత మార్గంగా ఎంచుకుని సమాజ సంస్కరణ కోసం కృషి చేశారని కొనియాడారు. సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో పద్యాలు, దోహాలు, భక్తి గీతాల ద్వారా సంత్ రవిదాస్ తన సందేశాన్ని విస్తృతంగా చాటారని తెలిపారు. ఆయన ఆధ్యాత్మిక గొప్పతనానికి నిదర్శనంగా సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో ఆయన రచించిన 41 దోహాలకు స్థానం లభించిందని గుర్తు చేశారు.
“సంత్ రవిదాస్ మహా అభియాన్” గురు పౌర్ణమి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే రవిదాస్ జయంతి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కలశ యాత్రలు, సామాజిక సమరసత సమావేశాలు, పుస్తకావిష్కరణలు, లఘు చిత్రాల ప్రదర్శనలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, గ్రామ స్థాయి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సంత్ రవిదాస్ బోధించిన సమానత్వం, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికీ చేర్చడమే ఈ అభియాన్ ప్రధాన లక్ష్యమని మాధవ్ పేర్కొన్నారు. కుల, వర్గ, మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి సామాజిక సమరసతను మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

More Stories
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
బిజెపి శ్రేణులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి