అక్టోబర్ 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేస్తున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రధాని పేరిట ప్రత్యేక పూజాకార్యక్రమాలను జనసేన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ నిర్వహించనున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రజాప్రస్థానం యాత్ర 2014 నుండి దేశ ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లగా దిగ్విజయంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో 25 ఏళ్ల మోదీ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రధాని మోదీ పేరిట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున విశిష్టమైన ఖడ్గమాల అర్చన/ప్రత్యేక పూజను ఎంపీ రమేష్ నిర్వహిస్తున్నారు.
ప్రధాన మంత్రిగా దేశ సేవలో నిరంతరం నిమగ్నమైన నరేంద్ర మోదీకి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, ఆయనకు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని, పాలనలో మరింత శక్తి సామర్థ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజను నిర్వహించనున్నారు. దేశాన్ని ‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని మోదీ నాయకత్వం మరింత బలోపేతం కావాలని, ఆయనకు కనకదుర్గమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
పవిత్ర కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రంలో నిర్వహించే ఖడ్గమాల పూజకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఖడ్గమాల పూజను తెల్లవారుజామున బహ్మముహూర్త సమయంలో అంతరాలయంలో నిర్వహిస్తారు. జగద్గురువులు ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రిలో ప్రతిష్టించిన శ్రీ చక్రానికి ఖడ్గమాల స్తోత్రంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, శాంతి, సంకల్పసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అత్యంత పవిత్రమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రధానమంత్రి మోదీ పేరిట ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఖడ్గమాల పూజ నిర్వహణతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శక్తి సామర్థ్యాలు లభిస్తాయని రమేష్ భావిస్తున్నారు. దేశ సేవలో ఆయన కొనసాగిస్తున్న నిరంతర కృషికి కనకదుర్గమ్మవారి ఆశీస్సులు లభించాలని, దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భరమైన భారతదేశంగా అభివృద్ధి చెందాలని, ‘వికసిత్ భారత్’ సంకల్పం సాకారం కావాలని ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More Stories
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
రాయలసీమను రతనాల సీమగా మార్చే హార్టికల్చర్ హబ్
స్వచ్ఛ భారత్ అంతరాత్మకు సంబంధించిన అంశం