ఏపీలో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌కు కీలక ముందడుగు

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) రూ.1.03 లక్ష కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌కు కీలక ముందడుగు పడింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ(ఈఏసీ) ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సీఆర్‌జెడ్‌) అనుమతులను మంజూరు చేయాలని సిఫారసు చేసింది. 
 
దీని ద్వారా దేశంలోనే మూడో అతిపెద్ద రిఫైనరీ సంస్థ బీపీసీఎల్‌కు రామాయపట్నం వద్ద నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. అనుమతులు వచ్చిన వెంటనే ప్లాంట్‌ నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి పెట్రో కెమికల్ కాంప్లెక్స్ పైన హామీ ఇచ్చారు. అందులో భాగం గా రామాయపట్నం పోర్టు సమీపంలో నెల్లూరు జిల్లా పరిధిలో 5200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు బీపీసీఎల్‌ ప్రతిపాదించింది. 
 
ప్రతిపాదిత భూముల్లో 1563 ఎకరాలను గ్రీన్‌ ఫీల్డ్‌ బెల్ట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం పెట్టుబడిలో రూ.3022 కోట్లు కేటాయించారు. ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక ప్రత్యక్షంగా 1250 మందికి, పరోక్షంగా 3750 మందికి ఉపాధి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. 
 
ఈ రిఫైనరీ, పెట్రో కమికల్‌ కాంప్లెక్స్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌, నాఫ్తా, ఎల్‌పీజీ, బిటుమినస్‌ వంటి వాటిని ఉత్పత్తి చేయనున్నారు. 5.4 మిలియన్‌ టన్నుల రవాణా ఇంధనాలు (పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌), మరో 3.2 మిలియన్‌ టన్నుల పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ను బీపీసీఎల్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేలా తుది కార్యాచరణ సిద్దం చేస్తోంది.

About The Author