చెక్ బౌన్స్ లో నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు ఏడాది జైలుశిక్ష‌

 
చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న‌ సినీయర్ న‌టుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలుశిక్ష వేసింది. జైలుశిక్ష‌తోపాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. బండ్ల గణేశ్ 2018లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. 
 
అయితే జానకి రామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకి బండ్ల గణేశ్‌ ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్’ పేరుతో రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దాంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.  కోర్టు విచారణలో నేరం పూర్తిగా రుజువు కావడంతో న్యాయమూర్తి బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చారు. 
 
ఆయనకు ఒక ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు, చెక్ విలువైన రూ. 95 లక్షలను జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ కేసు విచారణ నిమిత్తం న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చిన బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేశే పూర్తిగా భరించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. 
 
కాగా ఒంగోలు కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ  భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై త‌న‌కు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే త‌న ప‌ని అని పేర్కొన్నారు.

About The Author