ఎపిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారమే 39 కేసులు నమోదయ్యాయి. అయితే అనధికారికంగా మరికొన్ని కేసులుండవచ్చు. ఎపిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో జనంలో ఆందోళన వ్యక్తమవుతుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, భయపడా ల్సిన అవసరం లేదని, అనవసర ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కావడంతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం అప్రమత్తమైంది.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది ఇన్ పేషెంట్లుగా చేరడం లేదని, హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అంటున్నారు. మృతి చెందిన నలుగురు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారేనని చెబుతున్నారు.
అయితే దీర్ఘకాలిక రోగులున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలం కావడంతో వైరస్ వేగంగా విజృంభించడానికి అవకాశాలను కొట్టిపారేయలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బయటకు వెళ్లినప్పుడు విధిగా మాస్క్ లను ధరించాలని, బయట నుంచి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

More Stories
చేనేత భారతీయ సంస్కృతి, స్వావలంబన, స్వభీమానం ప్రతీక
రూ.1,240 కోట్లతో బళ్లారి- గుంతకల్లు రైల్వే ప్రాజెక్ట్
నీట్ వివాదంతో వైషమ్యాలు రెచ్చగొట్టే కుట్ర