విదేశాల్లో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరిట నిరుద్యోగులను నమ్మించి భారీ మోసాలకు పాల్పడిన కేసులో ప్రముఖ యూట్యూబర్ ‘నందుస్ వరల్డ్’ నిర్వాహకురాలు, ఎన్ఆర్ఐ రామ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల ద్వారా గుర్తింపు పొందిన ఆమె, ఆమె భర్త లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా స్పాన్సర్‌షిప్ అందిస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
జాగర్లమూడి మధుకర్, నందన (అన్నే రామ నందన) అనే భార్యాభర్తలు నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. గుంటూరుకు చెందిన వీరు రోజువారీ జీవిత విశేషాలు, ఫంక్షన్స్, ఇంటి పనులు, షాపింగ్, వంటలు, ట్రావెల్ వంటి వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఈ దంపతులు, విదేశాలలో అధిక వేతనం లభించే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం, ఇతర ప్రాంతాలలో ఈ మోసానికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగాలు ఇప్పించకపోగా, బాధితులకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు తెలిసింది. లండన్‌లో ఉద్యోగాలు, వీసా ఇప్పిస్తామని చెప్పి సుమారు వంద మంది నుంచి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలో నిందితురాలు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించేందుకు ప్రయత్నించిన సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. నందన జనవరిలో విడుదలైన చిరంజీవి హిట్ సినిమా మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటించింది.

More Stories
దసరాకు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ
ఏపీలో రూ.419 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విజయవంతంగా ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం