నీట్ వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీ వేదికగా వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. ఈ సాకుతో ప్రధాని మోదీతో పాటు సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు చెప్పారు. నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు మరికొందరు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు విద్యార్థి సంఘ నాయకులు విమర్శలకే పరిమితమై, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తమ సొంత పాలనలో జరిగిన పేపర్ లీకేజీలపై పార్లమెంట్‌లో మాట్లాడాలని, సభలో చర్చకు సిద్ధపడకుండా పారిపోతున్నారని సవాల్ విసిరారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో మోదీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
దేశమంతటా కొత్తగా ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన యూనివర్సిటీలను స్థాపించడంతో పాటు మెడికల్ సీట్లను సైతం అత్యధిక సంఖ్యలో అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గత ప్రభుత్వాల సమయంతో పోలిస్తే తమ హయాంలోనే క్వశ్చన్ పేపర్ లీకేజీలు గణనీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. నీట్ అంశంలో సమస్య తలెత్తిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కఠినమైన నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు.
కాగా, విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు మాధవ్ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా మోదీకి ఘన స్వాగతం పలికేందుకు దాదాపు 13 వేల మంది కళాకారులతో సంప్రదాయ థింసా నృత్యం, బొబ్బిలి వీణ నాదంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో భాగంగా ఏకంగా 3 లక్షల మందితో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్‌చేంజర్‌గా మారనుందని, ఈ ప్రాంతంలో వెనుకబాటుతనం లేకుండా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రాముఖ్యతను గుర్తించి, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృత్యర్థం ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన పేరు నామకరణం చేసినట్లు మాధవ్ వివరించారు.

More Stories
రూ.1,240 కోట్లతో బళ్లారి- గుంతకల్లు రైల్వే ప్రాజెక్ట్
మాజీ నాబార్డ్ ఛైర్మన్ పామిడి కోటయ్య కన్నుమూత
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్