ఆర్మీ భూముల్లోకి మళ్లీ ప్రవేశిస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు 

ఆర్మీ భూముల్లోకి మళ్లీ ప్రవేశిస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు 
సికింద్రాబాద్‌లోని లోతుకుంట ఆర్మీ భూముల వివాదంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఆర్మీ భూముల్లోకి మళ్లీ ప్రవేశిస్తే హైడ్రా అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే వారికి సంకెళ్లు కూడా వేయాలని ఆర్మీ అధికారులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 
 
లోతుకుంట భూములపై గురువారం జరిగిన విచారణలో ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.  వివాదాస్పద భూముల్లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రవేశిస్తే చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ హైడ్రా అధికారుల వైఖరిలో మార్పు కనిపించకపోవడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 
 
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపైనా తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  లోతుకుంటలో ఎం/ఎస్ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన స్థలంలో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్తిలోకి ఎలా ప్రవేశించారని నిలదీసింది. కోర్టు ధిక్కరణలు పునరావృతమవుతున్నాయని వ్యాఖ్యానిస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
 
కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంబంధిత అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగించడానికీ వెనుకాడబోమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వివాదాస్పద భూముల వద్ద శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఆర్మీ బలగాలను మోహరించాలని, కనీసం 10 మంది జవాన్లతో భద్రత ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. 
 
కోర్టు స్టే ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా అధికారులు అక్కడికి వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారు ఉపయోగించే అధికారిక వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది.  ఈ కేసులో పిటిషనర్ తరఫు లాయర్ హైడ్రా అధికారులు మళ్లీ వాహనాలతో వివాదాస్పద భూముల వద్దకు వచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
అయితే హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ అధికారులు భూముల్లోకి ప్రవేశించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించిన హైకోర్టు  తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ (చట్టపాలన) అమలులో ఉందని, ప్రభుత్వ సంస్థలు తమ అధికార పరిధిని దాటి వ్యవహరించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా గౌరవించాలని పేర్కొంది.