`ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల

`ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా, విద్యార్థుల న్యాయమైన హక్కులను సాధించేందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమానికి నాంది పలుకుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతం రావు,  రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే, తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను చైతన్యపరుస్తూ వివిధ దశల్లో ఉద్యమ కార్యాచరణ చేపడుతామని నాయకులు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా విడుదలయ్యే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 6.8 శాతం నిరుద్యోగిత రేటు తెలంగాణలో నమోదవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి, నేటి వరకు ఉద్యోగాలు లేవు… జాబ్ క్యాలెండర్ లేదు… ఇచ్చిన హామీల అమలూ లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.  వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని చెబుతూ అందుకే విద్యార్థుల న్యాయమైన హక్కు కోసం యువమోర్చా ఈ అంశాన్ని ఉద్యమంగా చేపట్టిందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా విడుదల చేసే వరకు ఈ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. 
ఈ ఉద్యమాన్నియువమోర్చా, మహిళా మోర్చాల ఆధ్వర్యంలో బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలిపారు.  ప్రతి స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విద్యార్థుల హక్కులను సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని రామచందర్ రావు తేల్చి చెప్పారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రమే కాకుండా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, యువతకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల స్థాపన వంటి అన్ని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాల్సిందే అని స్పష్టం చేశారు.