ఇస్రోలో యువ‌తకు ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం

ఇస్రోలో యువ‌తకు ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం
భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో)లో ఇంట‌ర్న్‌షిప్‌కు అవ‌కాశం ఉంది. ఇస్రో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థల్లో ఒక‌టి. అనేక విజ‌యాలు సాధించింది. ఇలాంటి సంస్థ‌కు ప‌ని చేయ‌డం అంటే దేశానికి సేవ చేయ‌డ‌మే అని భావించే వారు ఎంద‌రో. అలాంటివారి కోసం ఒక అవ‌కాశం క‌ల్పిస్తోంది ఇస్రో. ఈ సంస్థ‌లో ఇంట‌ర్న్‌షిప్ చేసేందుకు ఔత్సాహిక యువ‌త నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సైన్స్ అండ్ టెక్నాల‌జీ కోర్సుల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి ఇందులో అవ‌కాశం క‌ల్పిస్తోంది.
క‌నీసం 60 శాతం మార్కులు ఉన్న‌వారు లేదా సీజీపీఏలో 10కి 6.32 శాతం వ‌చ్చిన వారు అర్హులు. భార‌తీయులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  ఇస్రోకు సంబంధించిన అనేక యూనిట్ల‌లో, వివిధ విభాగాల్లో ఇంట‌ర్న్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ ప‌ని చేసిన వారికి స‌ర్టిఫికేష‌న్ ల‌భిస్తుంది. ఇది భ‌విష్య‌త్తులో ఇత‌ర సంస్థ‌ల్లో ఉద్యోగాల‌కు, ఉన్న‌త చ‌దువుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.
అయితే, ఈ ఇంట‌ర్న్‌షిప్‌న‌కు సంబంధించి ఎలాంటి పారితోషికం ఉండ‌దు. పైగా వ‌స‌తి, భోజ‌న‌ ఖ‌ర్చులు విద్యార్థులే భ‌రించుకోవాలి.  ఇటీవ‌లి కాలంలో ఇస్రోలో అనేకమంది సైంటిస్టులు రాజీనామా చేస్తున్నారు. వారిలో ఉన్న‌త విభాగాల్లో ప‌ని చేస్తున్న సీనియ‌ర్లు కూడా ఉన్నారు. వ‌రుస‌గా సైంటిస్టులు రాజీనామా చేస్తుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. దీంతో ప్ర‌స్తుతం ఇస్రోలో భారీగా ఖాళీలున్న‌ట్లు తెలుస్తోంది. ప‌దింట మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 
 
మొత్తం 20,269 పోస్టుల‌కుగాను ప్ర‌స్తుతం 5,632 ఉద్యోగాలు ఖాళీ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇస్రోలో ఈ స్థాయిలో సిబ్బంది కొర‌త ఉండ‌టం రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత ఇదే మొద‌టిసారి. 2001-2002లో ఇక్క‌డ 14,847 మంది పని చేశారు. ఇస్రోలో ఇంట‌ర్న్‌షిప్ పూర్తి వివ‌రాల కోసం సంస్థ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.