తెలంగాణకు బియ్యం సేకరణ 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు

తెలంగాణకు బియ్యం సేకరణ 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు

తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు (12లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.   ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి, సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయించారు.  
 
తెలంగాణలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి 8 జూలైనాడు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారితో సమావేశమై తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణ రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని బియ్యం సేకరణ పెంపు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునేలా సహకరించిన కేంద్ర మంత్రి  ప్రహ్లాద్ జోషికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  తెలంగాణకు 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన కమిట్‌మెంట్‌కు అనుగుణంగా బియ్యాన్ని సేకరించి భారత ఆహార సంస్థకు సకాలంలో అందజేయాలని సూచించారు. 
 
అయితే ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్న బియ్యాన్ని గత మార్కెటింగ్ సీజన్లలో నిర్ణీత గడువులో ఎఫ్సిఐకి ఇవ్వలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.   కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు సాగి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు పూర్తిచేసి, కేంద్రానికి ఇచ్చిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి గతంలో ఇచ్చిన బియ్యం కోటా, ఈరోజు పొడగించిన బియ్యం కోటాను విధిగా ఎఫ్సిఐకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

 కాగా, తెలంగాణ నుంచి బియ్యం సేకరణను మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, బిజెపి ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఈ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులు, ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.