ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో ధర్నా చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి యత్నించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ భవన్ ముట్టడికి బయల్దేరిన కాషాయ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం సమీపంలో బారికేడ్లు వేసి బీజేపీ నేతలను నిలువరించారు.
దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాషాయ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు కాషాయ శ్రేణులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతలు గాంధీభవన్ ముట్టడిని నిరసిస్తూ పోటీగా బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నంచడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ఒకరిపైకి ఒకరు కర్రలు, రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ మహిళా కానిస్టేబుల్ కాలికి గాయమైంది. ఓ రిపోర్టర్ తలకు గాయమవడంతో హాస్పిటల్‌కు తరలించారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ముట్టడులతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి నుంచి ఎంజీబీఎస్ వెళ్లే మార్గంలో వాహనాల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవంక, ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా లోక్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహేష్ గౌడ్, మంత్రులు, పొంగులేటి దామోదరలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన భౌతిక దాడిని, పోలీసుల నిరంకుశ వైఖరిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్.గౌతం రావు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎలాగైతే అహంకారం, విచ్ఛిన్నకర రాజకీయాలతో వ్యవహరిస్తున్నారో, ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కూడా అదే రీతిలో రౌడీయిజానికి దిగుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇక, కరీంనగర్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకునే క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు కీలక సమావేశాలు జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాహుల్ గాంధీ, సభను బహిష్కరించి వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు.
గతంలో రైతు ఉద్యమం ముసుగులో, షాహిన్ బాగ్ ఆందోళనలో ఏ విధంగానైతే దేశవ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయో, నేడు ‘సిజేపి’ పేరుతో జరుగుతున్న ధర్నా కూడా అదే తరహాలో సాగుతోందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసనకు దిగిన వారిలో అసలు నీట్ విద్యార్థులే లేరని, కేవలం యాంటీ సోషల్, అల్ట్రా లెఫ్ట్ మూకలను జమ చేసి ఆందోళనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
More Stories
విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి శ్రేణులు
ఖతార్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూలకేంద్రం
అస్సాంలో తీవ్రరూపం దాల్చిన వరదలు… 31 మంది మృతి