ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఆర్ఎఫ్.5 గుర్తింపు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.వైఎస్సార్ కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించగా ఆర్ఎఫ్.5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.దీంతో పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. అయితే ఈ వేరియంట్‌పై ప్రజలు అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆర్ఎఫ్.5 అనేది ఒమిక్రాన్ వైరస్‌కు చెందిన ఉపవంశమని, చాలా మందిలో సాధారణ లక్షణాలే కనిపించే అవకాశముందని చెబుతున్నారు.
అయితే మధుమేహం, గుండె, కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు, ఏడాది లోపు చిన్నారులు, గర్భిణులు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనాకు కారణమైన సార్స్ -సిఓవి-2 వైరస్ కాలక్రమంలో అనేక మార్పులకు లోనై ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందింది.ఒమిక్రాన్‌లోని జెఎన్.1 ఉపరకం నుంచి ఎల్ఎఫ్.7, పివై.1.1.1 అనే రెండు శాఖలు అభివృద్ధి చెందాయి.ఈ రెండు శాఖల జన్యు కలయికతో ఏర్పడిన రీకాంబినెంట్ వేరియంట్‌కే ఆర్ఎఫ్.5 అనే పేరు పెట్టారు. రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.చేతులను తరచుగా సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
మధుమేహం, గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి.ఆరోగ్యంగా ఉన్నవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. మూడు నుంచి నాలుగు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.
ఆర్ఎఫ్.5 వేరియంట్ సోకిన వారిలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లునొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.ఇలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

More Stories
మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంపై భూ కబ్జా కేసు
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
ఏపీలో 12 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి