ఏపీలో రూ.419 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీలో రూ.419 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
 
స్వదేశ్‌ దర్శన్‌ 2.0, ప్రసాద్‌ పథకాల కింద మొత్తం రూ.419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. స్వదేశ్‌ దర్శన్‌ పథకంలో రూ.152 కోట్లతో ఇప్పటికే అరకు గుహలు, సూర్యలంక బీచ్‌ అభివృద్ధి చేయడంతోపాటు నాగార్జునసాగర్‌ వద్ద బుద్దిస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో రూ.101.07 కోట్లతో అరకు కల్చరల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. కొత్తవలసలో ఐటీడీఏకు చెందిన 19.23 ఎకరాల స్థలంలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. గిరిజన సంస్కృతి, స్థానిక వంటకాలు, అరకు కాఫీ, చిరుధాన్యాల ప్రత్యేకతలను పర్యాటకులకు పరిచయం చేయనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.107.94 కోట్లతో ‘అరసవల్లి సన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు చేయనున్నారు. నాగావళి నది ఒడ్డున ఉన్న చారిత్రక డచ్‌ హెరిటేజ్‌ భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురానున్నారు. డిజిటల్‌ ప్రదర్శనలు, మ్యూజియం, హస్తకళల అనుభవాలు, తదితర సదుపాయాలతో నాగావళి రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు.

విజయవాడ విమానాశ్రయానికి కిలోమీటర్‌ దూరంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో రూ.176 కోట్లతో ‘గన్నవరం మైస్‌ సెంటర్‌’ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసే ఇమ్మర్సివ్‌ థియేటర్, ప్రసిద్ధ స్వీట్లు, జ్ఞాపికల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

నెల్లూరు జిల్లాలో వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.34.29 కోట్లతో ప్రసాద్‌ పథకం అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రాకపోకలు, క్యూల నిర్వహణ, వేచి ఉండే ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. టూరిస్ట్‌ అమెనిటీ సెంటర్, వెయిటింగ్‌ హాళ్లు, కొత్త అన్నదాన భవనం, వంటశాల, ప్రవేశ ద్వారం, నడక మార్గాలు, ల్యాండ్‌స్కేపింగ్, భక్తుల పార్క్, కూర్చునే ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.

స్వదేశ్‌ దర్శన్‌ 2.0లో మరికొన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మచిలీపట్నంలో కోస్టల్‌ ఎక్స్‌పీరియన్స్, మంగళగిరి ఆలయ పరిసరాల్లో పర్యాటక సదుపాయాలు, మంగళగిరి ఎకో పార్క్‌ అభివృద్ధి, నంద్యాల జిల్లాలో బెలూం గుహల్లో కేవ్‌ లైటింగ్, సందర్శకులకు సదుపాయాల కల్పన వంటివి వీటిలో ఉన్నాయి.