ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను… షేక్ హసీనా

ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను… షేక్ హసీనా
తీవ్ర రాజకీయ సంక్షోభం మధ్య బంగ్లాదే‌శ్‌ను వీడి వచ్చి భారత్‌లో సుమారు రెండేళ్లుగా ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా  మీడియా సంస్థ ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఏడాదే తన స్వదేశానికి వెళ్లిపోతానని వెల్లడించారు.  ప్రస్తుతానికి దేశ బహిష్కరణలో ఉంటూ, స్వదేశంలో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమె ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని అధిగమించి మరీ తాను తన సొంత దేశానికి చేరుకుంటానని ధీమాగా ప్రకటించారు. తనపై నమోదైన కేసులు, కోర్టులు విధించిన మరణశిక్షలపై హసీనా తీవ్రంగా స్పందించారు. 
 
“నాపై వచ్చిన తీర్పులు చట్టబద్ధమైనవి కావు. అవి ముందస్తు వ్యూహంతో, రాజకీయ ప్రేరేపితంగా జరిగిన రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియ. అవామీ లీగ్‌ను నాయకత్వ రహితంగా మార్చేందుకు ప్రస్తుత పాలకులు న్యాయ వ్యవస్థను ఓ ప్రతీకార సాధనంగా వాడుకుంటున్నారు. 1975లో నా తల్లిదండ్రులు, సోదరులతో సహా నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయాను. నాపై గ్రెనేడ్ దాడులు కూడా జరిగాయి. నేను చావుకు భయపడను” అని ఆమె స్పష్టం చేశారు.
 
తన తిరుగు ప్రయాణం అనేది వ్యక్తిగత ఆశయానికి సంబంధించిన విషయం కాదని, ఇది బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, చట్ట పాలన, మన విముక్తి పోరాట స్ఫూర్తి వంటి అత్యంత కీలకమైన అంశాలతో ముడిపడి ఉందని హసీనా తెలిపారు. తాను అధికారం కోసం రాజకీయాలు చేయనని, బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం, ‘సోనార్ బంగ్లా’ (సువర్ణ బంగ్లా)ను నిర్మించాలన్న జాతిపిత బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కలను సాకారం చేయడం కోసం రాజకీయాలు చేస్తానని తెలిపారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు న్యాయమైనది కాదని ఆమె స్పష్టం చేశారు.
 
“అవామీ లీగ్ రాజకీయ పునరుజ్జీవం ఏ ప్రభుత్వ దయపైనో ఆధారపడి లేదు. అది ప్రజలపై ఆధారపడి ఉంది. అక్రమ నిషేధం ద్వారా వారు అవామీ లీగ్‌ను ఒక ప్రహసనప్రాయమైన ఎన్నికలకు దూరంగా ఉంచి ఉండవచ్చు, పార్టీ కార్యాలయాలను మూసివేసి ఉండవచ్చు. రాజకీయ కార్యకలాపాలను తాత్కాలికంగా అణచివేసి ఉండవచ్చు. కానీ, ప్రజల హృదయాల నుండి అవామీ లీగ్‌ను చెరిపివేయడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. అందుకే అవామీ లీగ్ ఇప్పటికే తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది” అని హసీనా చెప్పారు.
 
చట్టం అమలు చేసే సంస్థల వేధింపులు, అణచివేత చర్యలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా వివిధ జిల్లాలు, ఉపజిల్లాలు, యూనియన్లు, స్థానిక ప్రాంతాలలో అవామీ లీగ్‌కు మద్దతుగా ప్రతిరోజూ ఊరేగింపులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. జూన్ 23వ తేదీన దేశవ్యాప్త నిషేధాన్ని ధిక్కరిస్తూ అవామీ లీగ్ తన 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై హసీనా స్పందిస్తూ అవామీ లీగ్ అనేది కేవలం కాగితాలకే పరిమితమైన సంస్థ కాదని, అది బంగ్లాదేశ్ మట్టిలో, ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఒక బలమైన రాజకీయ శక్తి అని అభివర్ణించారు.  మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, ప్రస్తుతం నకిలీ ఎన్నికల ద్వారా ఏర్పడిన బీఎన్‌పీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆమె ఆరోపించారు.
బాంగ్లాదేశ్‌లో హిందూ తదితర మైనారిటీల రక్షణపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ఆగస్టు 5వ తేదీ నాటి తిరుగుబాటు తర్వాత హిందూ దేవాలయాల ధ్వంసం, ఆస్తుల లూటీలు నిరంతరాయంగా సాగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల హక్కుల కోసం పోరాడిన చిన్మయ్ కృష్ణ దాస్ వంటి నాయకులను తప్పుడు కేసులతో జైల్లో పెట్టడాన్ని హసీనా తప్పుబట్టారు. 
 
“మైనారిటీలు కేవలం ఓటు బ్యాంక్ కాదు. వారు దేశ సమాన పౌరులు. వారిపై జరిగే ప్రతి దాడి బాంగ్లాదేశ్ స్వాతంత్య్రంపై జరిగే దాడితో సమానం” అని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నప్పటికీ తన హృదయం ఎప్పుడూ బాంగ్లాదేశ్ ప్రజల కోసమే తపిస్తుందని పేర్కొంటూ అవామీ లీగ్ త్వరలోనే ప్రజా బలంతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.