తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ
తెలంగాణ ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని పేర్కొంటూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని మొదటి నుంచి చివరి వరకు ఎదిరించి పోరాడింది భారతీయ జనతా పార్టీయేనని చెబుతూ అయితే కొన్ని పొరపాట్ల వలన ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. 
 
మూడు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో  మాట్లాడుతూ  బిఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బిజెపిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. 
 
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఇంటింటికీ వెళ్ళాలని, ప్రజలతో మమేకమవుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆయన సూచించారు.  రాష్ట్రంలో ప్రతి బీజేపీ కార్యకర్తా 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సన్నద్ధం కావాలని నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు.  అలాగే ప్రతి ఓటరునూ సంప్రదించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని చెప్పారు. 
 
కేంద్ర పథకాల లబ్థిదారులందరినీ కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలని, సమాజంలోని ప్రతి వర్గంతో అనుబంధం పెంచుకోవాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. ‘‘త్వరలో జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బీజేపీ మాత్రమే. భాగ్యనగర భవిష్యత్తును మార్చాలంటే మనం ప్రజల మధ్యకు మరింత బలంగా వెళ్లాలి’’ అని స్పష్టం చేశారు. 
 
రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుతో పోటీ చేసే ప్రతి అభ్యర్థినీ గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గత (కేసీఆర్‌) సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని, మేడిగడ్డ పేరుతో ప్రజల సొమ్ము నీళ్లపాలు చేసిందని నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. ప్రజల కష్టార్జితాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. 
 
అవినీతిపరుల నల్ల ముఖాన్ని తాము బయటికి తెస్తామని, కాళేశ్వరం దోషులకు శిక్ష పడేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయాన్ని ప్రారంభిస్తూ అదే సమయంలో ఒకేసారి రాష్ట్రంలోని 9 జిల్లా బిజెపి నూతన కార్యాలయాలను (రంగారెడ్డి రూరల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్)  వర్చువల్‌ విధానంలో  ప్రారంభించారు. 
 
కొత్తగా ప్రారంభించుకున్న బిజెపి జిల్లా కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘సంకల్ప కేంద్రాలు’, ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలని స్పష్టం చేశారు. “నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో పనిచేసే బిజెపి కార్యకర్తలకు ఈ కార్యాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయని భరోసా వ్యక్తం చేశారు.  పశ్చిమబెంగాల్‌ తరహాలోనే ఈసారి తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 
తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లయినా అమరవీరులు కలలుగన్న స్వప్నం ఇంకా పూర్తిగా నెరవేరలేదని చెబుతూ ఆ ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత బిజెపిపైన ఉందని చెప్పారు. కొందరు బిజెపిని బయటి పార్టీ అని విమర్శిస్తుంటారని మండిపడుతూ 1984లో దేశవ్యాప్తంగా పార్టీకి కేవలం ఇద్దరే ఎంపీలు ఉంటే, అందులో ఒకరు తెలంగాణ గడ్డ నుంచే గెలిచారనే చారిత్రాత్మక సత్యాన్ని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలు, పోలీస్ లాఠీదెబ్బలు, పోరాటాలు, ప్రాణత్యాగాలతో తెలంగాణ నేలపై కమల వనాన్ని పూయించిన సీనియర్ కార్యకర్తలందరికీ ఆయన హృదయపూర్వకంగా శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించారు.

కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల అవకాశవాద రాజకీయాలపై నితిన్ నబిన్  తీవ్రస్థాయిలో ఎండగడుతూ రాష్ట్రాన్ని కేవలం అధికారాన్ని అనుభవించే సాధనంగా మార్చుకున్న పాలకులను గద్దెదించే శక్తి ఒక్క బిజెపి కార్యకర్తలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై బిజెపి కార్యకర్తలు పోరాడితే, ఆ పోరాట ఫలాన్ని కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా పొందిందని విమర్శించారు. 

 
దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర కాంగ్రెస్‌దని, పాలనలో ఘోరంగా విఫలమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పోరాటాల ద్వారా గద్దెదించేందుకు కార్యకర్తలు గ్రామ గ్రామాన, వీధి వీధినా కదలాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో హింసలు, అరాచకాలను ఎదుర్కొని, పోరాటాలతో అక్కడ కమలం ఎలా వికసించిందో, తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.  
 
బీజేపీ ఆవిర్భావ సమయంలో దేశవ్యాప్తంగా గెలుచుకున్న రెండు సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి ఉండటం ఎంతో గర్వకారణమని చెబుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తెలంగాణలోనూ వ్యూహాలు రచిస్తారని వెల్లడించారు. 
 
కాగా రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ బీజేపీ నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు రచించిన రెండు గ్రంథాలను నితిన్‌ నబీన్‌ ఆవిష్కరించారు. వాటిలో ఒకటి.. ‘‘శ్రీ నరేంద్ర మోదీ: భారత్‌ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు’’ అనే 600 పేజీల త్రిభాషా (తెలుగు-హిందీ-ఆంగ్లం) గ్రంథం కాగా.. మరొకటి ‘‘అంత్యోదయం నుంచి వికసిత భారత్‌’’ పేరుతో విడుదలైన 500 పేజీల గ్రంథం.