ఓటర్ జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) గురువారం తెలంగాణాలో నుంచి ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ అప్రమత్తమయ్యాయి. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) గురువారం నుంచి ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయనున్నారు.
ఈసీఐ ఇప్పటికే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియను చేపట్టేందుకు దాదాపు 90 వేల మంది ప్రత్యక్షంగా పనిచేయనున్నారు. వారిలో ఇంటింటి సర్వే చేపట్టనున్న బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) 35,985 మంది, క్షేత్రస్థాయిలో బీఎల్వో సూపర్ వైజర్లు 3,596 మంది కాగా, రాజకీయ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉండే బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) 49,018 మంది.
వచ్చే నెల 24వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాల నమోదును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లి వివరాల నమోదుకు సహాయం చేసి, పూర్తిచేసిన ఫారాలను సేకరిస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది.
ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన అని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ మహాక్రతువు ఎలా సాగనుంది? గురువారంనుంచి జూలై 24 వరకూ బీఎల్ వోలు ఇంటింటి సర్వే చేపడతారు. అందులో సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేకున్నా, తప్పులు దొర్లినా ఓటర్లు క్లెయిమ్ చేసుకోవడానికి, సవరణల కొరకు దరఖాస్తులు సమర్పించేందుకు నెల రోజుల సమయం ఇస్తారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకూ సవరణలు, అభ్యంతరాల స్వీకరణ చేపడుతూనే విచారణలు, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 నాటికి పూర్తిచేస్తారు.
అన్ని ప్రక్రియలూ పూర్తిచేసి తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించేలా ఈసీఐ మన రాష్ట్రానికి షెడ్యూల్ను ఖరారు చేసింది. దీని ప్రకారం సర్ ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (ఓటర్ల సంఖ్య ఆధారంగా కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయడం) పూర్తిచేస్తారు.
ఈసీ సిద్ధం చేసిన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకుగాను.. ఈనెల 20నాటికి ఆన్లైన్లో 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేశారు. 99,64,126 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లో ఉన్నట్లు నివేదికలో ఈసీ పేర్కొంది. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో 89,88,175 మందికి వివిధ రకాల ధ్రువీకరణ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో వీరి శాతం 37.67గా నమోదైంది.

More Stories
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
శ్యామాప్రసాద్ ముఖర్జీకి బిజెపి ఘన నివాళులు
బాసర అమ్మవారి ఆలయంలో భారీ చోరీ