హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో తొలి దశ స్వాధీనం, రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.  కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఖ‌ట్టర్‌ నివాసంలో ఈ అంశంపై చ‌ర్చించారు. 
 
ఎల్ అండ్ టీ సంస్థ వద్ద నుంచి హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవడంతోపాటు సెకండ్ ఫేజ్ విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యుయేష‌న్‌, ఫేజ్‌-I స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, మెట్రో ఫేజ్‌-II విస్తరణకు సంబంధించిన అంశాల‌ను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్రమంత్రులు, సీఎం ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. క‌న్సల్టెంట్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేశారు.
 
ఈ ఎస్‌బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కన్సల్టెంట్‌లో సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారితోపాటు, రాష్ట్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఉంటారు.  మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా టేకోవర్ చేసుకోవాలి? ఫేజ్-2 విస్తరణకు ఐఆర్ఎఫ్‌సీ నుంచి తక్కువ వడ్డీకే రుణాన్ని ఎలా పొందాలి? అనే విషయాలపై ఎస్‌బీఐ క్యాప్స్ సమగ్రంగా రిపోర్టును అందించనుంది. 
 
ఈ రిపోర్టు ఆధారంగానే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ తదుపరి నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది. ఈ చర్చల్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానినికి సమర్పించిన రెండో దశ మెట్రో విస్తరణ ప్రణాళికలో భాగంగా దాదాపు 70 కిలోమీటర్ల పైగా కొత్త మార్గాలను ప్రతిపాదించినట్లు సమాచారం. 
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన సీఎం ప్రధానంగా మెట్రో విస్తరణ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రుణ సదుపాయం, హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ విస్తరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయమని కోరుతూ తనకు రెండుసార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. గత రెండు రోజులుగా తాను ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశానని చెప్పారు. సోమవారం అశ్వినీ వైష్ణవ్తో జరిగిన సమావేశం, కేంద్ర మంత్రి ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్లతో మనగలవారం జరిగిన సంయుక్త సమావేశం అనుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా, తాను ఎల్లప్పుడూ తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.