ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు వెకేషన్‌కు వెళ్లిన 27 ఏళ్ల ఢిల్లీ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హోటల్ గదిలోనే అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. రక్తం, మూత్రం మడుగులో ఆమె వివస్త్రగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తూ గురుగ్రామ్‌లోని ఒక ఐటీ సంస్థలో పని చేస్తున్న పి. రాధా గాయత్రిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం రాధా గాయత్రి, ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్ ఇద్దరిదీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. వీరికి 2025 నవంబర్ 8వ తేదీన వివాహం జరిగింది. శ్రీచరణ్ పూణేలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి వెకేషన్ కోసం జూన్ 13వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి మొదట రిషికేష్ చేరుకున్నారు.
ఆ మరుసటి రోజు అంటే జూన్ 14వ తేదీన రాత్రి ఆలస్యంగా ముస్సోరీలోని తిప్రీధర్ ప్రాంతంలో ఉన్న ‘కియానా హోమ్‌స్టే’కు చేరుకుని, అందులోని ‘బ్లిస్’ అనే రూమ్‌లో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చెక్-ఇన్ అయ్యారు. అయితే సోమవారం ఉదయం హోమ్‌స్టేలో ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉందంటూ ముస్సోరీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు 108 అంబులెన్స్‌తో సహా ఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం రూమ్‌కి వచ్చిన తర్వాత రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారని, తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిద్రపోయారని తెలిపాడు. అయితే ఉదయం తను నిద్రలేచి చూసేసరికి భార్య గాయత్రి ఒంటిపై బట్టలు లేకుండా, ముక్కు నుంచి రక్తం కారుతూ, మూత్రం, రక్తం మడుగులో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉందని చెప్పాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించాయి.
అలాగే ఆ గది నుండి రెండు ఖాళీ మద్యపు సీసాలను, తినుబండారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహమై కేవలం ఏడు నెలలు మాత్రమే కావడం, మరణం సంభవించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది అతిగా మద్యం సేవించడం వల్ల జరిగిన ప్రమాదమా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోస్టుమార్టాన్ని వైద్యుల ప్రత్యేక ప్యానెల్‌చే నిర్వహించాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలని పోలీసులు అభ్యర్థించారు.

More Stories
పాట్నా సమీపంలో 15 ఎకరాల్లో శ్రీవారి ఆలయం
వికసిత భారత్ నిర్మాణంలో రైల్వేలే కీలకం
దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని దేశద్రోహ శక్తులు