లిక్కర్ స్కామ్ లో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్

లిక్కర్ స్కామ్ లో వైసిపి మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను అరెస్ట్ చేయడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో మనీలాండరింగ్, అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కారుమూరి సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లోని కారుమూరి కుటుంబానికి చెందిన నివాసంలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 

ఆ సందర్భంగా పలు కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆధారాల పరిశీలన అనంతరం సునీల్ అరెస్టుకు ఈడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ మద్యం విధానానికి సంబంధించిన వ్యవహారాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 

ప్రభుత్వ అనుమతులు, సరఫరా వ్యవస్థ, నిధుల ప్రవాహం, అనుబంధ సంస్థల లావాదేవీలపై ఈడీ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో నిధుల మళ్లింపు, మనీలాండరింగ్ కోణాలపై ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో ఇప్పటికే కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. 

ఇదే కేసుల మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావును గతంలో సిట్ విచారణ చేసింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి పైన అభియోగాలు ఉన్నాయి. వందల కోట్ల మేర లావా దేవీలు నిర్వహించినట్లు విచారణలో గుర్తించారు. మద్యం రవాణా, టెండర్లు సబ్ కాంట్రాక్టుల అవకతవకల విషయంలో కారుమూరిపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. 

మద్యం రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.200 నుంచి రూ. 250 కోట్ల వరకు గండి కొట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన కుమారుడిని ఈడీ లావాదేవీల పైన ఆరా తీసింది. దీనికి సంబంధించి ఆధారాలు దొరకటంతో కారుమూరి కుమారుడు సునీల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. కారుమూరి సునీల్ అరెస్టుతో ఈ కేసు దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ అవుతాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.