వికసిత భారత్ నిర్మాణంలో రైల్వేలే కీలకం

వికసిత భారత్ నిర్మాణంలో రైల్వేలే కీలకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రైల్వే రంగం విప్లవాత్మక మార్పులను చవిచూస్తోందని, వికసిత భారత్ లక్ష్య సాధనలో రైల్వేలు కీలక శక్తిగా మారాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆయన, స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.35 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ రైల్వే మౌలిక వసతులను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  దేశంలో ప్రస్తుతం 1.05 లక్షల కిలోమీటర్లకు పైగా రైల్వే నెట్‌వర్క్ ఉందని, దీనిని పూర్తిస్థాయిలో విద్యుదీకరించే కార్యక్రమం వేగంగా సాగుతోందని తెలిపారు. 
 
విద్యుదీకరణ చేపట్టకపోతే దేశం లక్షల కోట్ల లీటర్ల డీజిల్ దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేదని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుతూ సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించడంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.10,144 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 
 
విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పొడవైన పశ్చిమ బైపాస్‌‌ను కూడా పరిశీలించారు. సుమారు రూ. 2,700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ మార్గంతో గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలు కృష్ణా నదిపై ఉన్న వంతెన ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డు ఉపయోగించి వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరుకోవచ్చని నేషనల్ హైవే అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
 
రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, స్టేషన్‌ల ఆధునికీకరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన, ప్రధాని మోదీ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 
 
భవిష్యత్తులో దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే కీలక రైల్వే మార్గాలు అమరావతికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో కలిసి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.