ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బురదజల్లుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బురదజల్లుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్
ఓటరు జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన  ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ స్వార్థంతో బురదజల్లుతున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ గారో లేదా కేంద్ర ప్రభుత్వమో సొంతంగా తెచ్చిన కార్యక్రమం కాదని, ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. 
 
దేశంలో ఇప్పటివరకు 12 సార్లు ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని గుర్తుచేశారు. 1951 నుండి 2002 వరకు కాంగ్రెస్ హయాంలోనే అనేకసార్లు ఎస్‌ఐఆర్ జరిగితే అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ వల్లే బెంగాల్‌లో బీజేపీ గెలిచిందని మేధావులమని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. 
 
మరి అదే ఎస్‌ఐఆర్ జరిగిన కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచినప్పుడు ఎస్‌ఐఆర్ గుర్తుకురాలేదా? అని నిలదీశారు. దేశ సరిహద్దులైన బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ అక్రమ చొరబాటుదారులు స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దొంగ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించి ఓటర్లుగా నమోదవుతున్నారని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
పాతబస్తీలో ఒక్కో ఇంట్లో 200 దొంగ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌లో దాదాపు 5 వేల నుండి 10 వేల మంది పాకిస్తానీయులు చట్టవిరుద్ధంగా ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలా? అని నిలదీశారు. దొంగ ఓట్లను ఏరివేయడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని, అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటూ పోదని హామీ ఇచ్చారు.

“ఓటు చోరీ” అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే వారి ‘మెదడు చోరీ’ అయిందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చరిత్రే ఓట్ల చోరీ, సీట్ల చోరీలతో కూడుకున్నదని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల్లో సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు, నెహ్రూకు కేవలం 2 ఓట్లు వస్తే నెహ్రూను పీఎంను చేయడం ఓటు చోరీ కాదా? అని ప్రశ్నించారు. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని చోరీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా? అని నిలదీశారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ కు చెందినవారికి రిటైర్మెంట్ తర్వాత పద్మ అవార్డులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిందని ఆరోపించారు. బోగస్ ఓట్లతో గెలిచే అలవాటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఇప్పుడు ఎస్‌ఐఆర్ వల్ల తమ దొంగ ఓట్లు ఎగిరిపోతాయనే భయంతో ఏడుస్తున్నాయని మండిపడ్డారు.

ఈ ప్రక్రియలో ప్రతి బూత్ వద్ద అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు  పాల్గొంటున్నారని, అంతా పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, తన సిబ్బందిపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏడాది జైలు శిక్ష పడుతుందనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. 

 
గతంలో ‘ఓటుకు నోటు’ కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ గెలవబోతోందని, ఓటమి భయంతోనే ఈ ముఠా అంతా కలిసి బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని దయ్యబట్టారు. తెలంగాణ ప్రజలందరూ ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, బీఎల్ఓల వద్ద ఫారాలు తీసుకుని తమ ఓట్లను క్లీన్ చేసుకోవాలని, డూప్లికేట్ ఓట్లు ఉంటే తొలగించుకోవాలని పిలుపునిచ్చారు.