ఇకపై కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృతం తప్పనిసరి

ఇకపై కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృతం తప్పనిసరి

2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో 6వ తరగతి, 9వ తరగతుల్లో కనీసం ఒక సంస్కృత సెక్షన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని  కేంద్ర విద్యాశాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ ఈపి-2020) అమలులో భాగంగా మూడో భాషా విధానం (ఆర్3) అమలుకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

మే 29న జారీ చేసిన సర్క్యులర్‌లో కేవీఎస్ ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడో భాష ఎంపికకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించే ప్రక్రియను అన్ని కేంద్రీయ విద్యాలయాలు పూర్తి చేసి ఉండాలని సూచించింది. కేవీఎస్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు మూడో భాషగా సంస్కృతం లేదా తమ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చు. 

అయితే ఈ భాషలు మొదటి భాష (ఆర్1) అయిన హిందీ, రెండో భాష (ఆర్2) అయిన ఇంగ్లీష్‌కు భిన్నంగా ఉండాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ భాషల జాబితాలో ఉన్న భాషలనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా సంస్కృతం లేదా ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. 

అయితే దేశవ్యాప్తంగా బదిలీలు అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి కేంద్రీయ విద్యాలయంలో కనీసం ఒక సంస్కృత సెక్షన్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంచుకున్న మూడో భాష ఆధారంగా సెక్షన్లను ఏర్పాటు చేయాలని కేవీఎస్ సూచించింది. ఒకే భాషను ఎంచుకున్న విద్యార్థులను ఒకే సెక్షన్‌లో ఉంచడం వల్ల తరగతుల నిర్వహణ సులభంగా ఉంటుందని పేర్కొంది. 

అలాగే విద్యార్థుల మూడో భాష ఎంపికలకు సంబంధించిన వివరాలను ‘సమాగమ్’ పోర్టల్‌లో నమోదు చేయాలని అన్ని పాఠశాలలకు ఆదేశించింది. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఆయా పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యను తిరిగి అంచనా వేయనుంది. సంస్కృతం, ప్రాంతీయ భాషలను ఎంచుకున్న విద్యార్థుల వివరాలను వేర్వేరుగా నమోదు చేయాలని స్పష్టం చేసింది.