బహుళ స్థాయి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రయోగం

బహుళ స్థాయి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రయోగం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) శత్రు క్షిపణులు, నౌకల దాడులను తిప్పికొట్టే అధునాతన సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించింది. ఈనెల 10,11న డీఆర్​డీఓ మూడు ప్రయోగాలు చేపట్టింది. అందులో భాగంగా మల్టీ లేయర్‌ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రయోగించింది.  ఈ ప్రయోగంలో ఇంటర్‌సెప్టర్ క్షిపణులు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఖండాతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం వీటికి ఉంది.
నేవల్ యాంటీ-షిప్ మిస్సైల్ పరీక్ష బాలిస్టిక్ క్షిపణులతో పాటు, సరికొత్త నేవల్ యాంటీ-షిప్ మిస్సైల్-మీడియం రేంజ్ క్షిపణిని కూడా తొలిసారిగా పరీక్షించింది.  ఈ క్షిపణి సముద్రంలో శత్రువుల యుద్ధనౌకలను నాశనం చేయగలదు. ఇది భారత నౌకాదళ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. దేశ సాంకేతికతకు పెద్దపీట వేసిన ఈ రక్షణ వ్యవస్థలన్నింటినీ స్వదేశీ సాంకేతికతతోనే తయారు చేశారు. 
 
తాజా ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , డీఆర్​డీఓ ఛైర్మన్ రాజేశ్ కుమార్ సింగ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయాలు రక్షణ రంగంలో భారతదేశ స్వయం సమృద్ధిని నిరూపిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
 
“ముప్పుగా దూసుకొచ్చే క్షిపణులను కూల్చివేసేందుకు ప్రయోగించిన ‘ఇంటర్‌సెప్టర్’ క్షిపణులు తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. తలెత్తే క్షిపణి ముప్పులను ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతికతతో ఈ వ్యవస్థలను రూపొందించి, అభివృద్ధి చేశారు” అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరీక్షల ద్వారా, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (ఐసిబిఎం) స్థాయి ముప్పులను కూడా ఎదుర్కోగల ‘బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్’ (బిఎండి) సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది. 
 
గత రెండు దశాబ్దాలుగా భారత్ క్షిపణి ఇంటర్‌సెప్టర్లను అభివృద్ధి చేస్తోంది. అత్యంత ఎత్తులో లక్ష్యాలను ఛేదించే ‘పృథ్వీ ఎయిర్ డిఫెన్స్’  ఇంటర్‌సెప్టర్ తొలి పరీక్ష 2006-07లో జరిగింది. ఆ తర్వాత తక్కువ ఎత్తులో లక్ష్యాలను అడ్డుకునే ‘అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్’  ఇంటర్‌సెప్టర్ పరీక్షలు జరిగాయి. కాలక్రమేణా ఈ వ్యవస్థలను మరింత మెరుగుపరిచారు. 2017,  2018లలో ఒడిశా తీరంలో ఈ రెండు వ్యవస్థల అనేక విజయవంతమైన పరీక్షలు నిర్వహించారు. 
 
బాలిస్టిక్ క్షిపణి తరహా లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో అడ్డుకునే సామర్థ్యాన్ని ఈ పరీక్షలు నిరూపించాయి. ఏప్రిల్ 2023లో, సముద్రం ఆధారిత (నౌకాదళ) బిఎండి ఇంటర్‌సెప్టర్  తొలి ప్రయోగ పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. గత రెండు రోజులుగా జరిగిన పరీక్షలు, ఐసిబిఎం స్థాయి ముప్పులను ఎదుర్కోగల సామర్థ్యంతో సహా  సుదూర పరిధి మరియు అధిక వేగంతో లక్ష్యాలను అడ్డుకునే సామర్థ్యాన్ని పెంపొందించే అభివృద్ధి ప్రక్రియలో తదుపరి దశలో భాగంగా ఉన్నాయి.