నీట్‌ పరీక్షకు అదనంగా 15 నిమిషాలు.. రఫ్‌ వర్క్‌ పేజీల రెట్టింపు

నీట్‌ పరీక్షకు అదనంగా 15 నిమిషాలు.. రఫ్‌ వర్క్‌ పేజీల రెట్టింపు
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ‌పశ్నాప్రతాల లీకేజీ వ్యవహారం అనంతరం ఈ నెల 21న నిర్వహించనున్న నీట్‌ రీ ఎగ్జామ్​ 2026లో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌‌టిఎ) మరోమారు మార్పులు చేసింది. పరీక్షా సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగించింది.  ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకూ జరుగుతుందని తెలిపింది. మొత్తంగా ఈ పరీక్ష 195 నిమిషాల పాటు జరగనుంది. ఇందులో పరీక్షకు ముందు హాజరు పట్టికలో సంతకం చేయడం, తనిఖీ తదితర పనులు కూడా ఉంటాయి.
 
పరీక్ష ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ఇన్విజిలేషన్‌ ప్రక్రియకు పెంచిన సమయం ఉపయోగపడుతుందని తెలిపింది. అభ్యర్థుల నుంచి గత కొన్నేళ్లుగా వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేశామని చెప్పడం గమనార్హం. అలాగే రఫ్‌ వర్క్‌ కోసం ఇచ్చే పేజీలను కూడా రెట్టింపు చేసినట్లు వెల్లడించింది. 
 
ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్‌ కోసం ఇప్పటివరకూ రెండు పేజీలు ఇస్తుండగా ఈ సారి 4 పేజీలు ఇవ్వనున్నట్లు ఎన్‌‌టిఎ పేర్కొంది.  ఎడమచేతి వాటం ఉన్న విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నపత్రం మొదట్లో, చివరిలో రెండేసి రఫ్‌ పేపర్లను ఏర్పాటు చేసినట్లు వివరించింది. గతంలో, రఫ్ వర్క్ పేజీలు కేవలం ప్రశ్నపత్రం బుక్‌లెట్ చివరలో మాత్రమే ఉండేవి. సవరించిన విధానం ప్రకారం, సూచనల పేజీ తర్వాత వెంటనే రెండు రఫ్ వర్క్ పేజీలు ఉంటాయి.
అలాగే మరో రెండు అదనపు పేజీలు బుక్‌లెట్ చివరలో ఉంటాయి.  ఈ కొత్త విధానం ప్రశ్నపత్రం ఇంగ్లీష్, ప్రాంతీయ భాషా వెర్షన్లు రెండింటిలోనూ ప్రవేశపెట్టారు.  వాస్తవానికి మే 3న నీట్‌ జరగ్గా పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది.  ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా దానిని రద్దుచేసి, జూన్ 21న మళ్లీ నిర్వహిస్తోంది. నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తోంది. 
రద్దయిన నీట్‌-2026 పరీక్షను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక పోలీసులతోపాటు పారామిలిటరీ బలగాలతో భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో ఉన్న ప్రధాన కేంద్రాల నుంచి నీట్‌ ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ జవాబు పత్రాలను దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు అక్కడి నుంచి పరీక్ష జరిగే పట్టణాలు, కేంద్రాలకు తరలించనున్నారు.
సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌ పారా మిలిటరీ బలగాల భద్రత మధ్య రోడ్డు మార్గంలో, అవసరమైన చోట విమానాలు, హెలికాప్టర్లలో ఈ తరలింపు ప్రక్రియ జరగనుందని ‘జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ)’ అధికారులు వెల్లడించారు.