కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం ధర్నా 

కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం ధర్నా 
విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ సమీపంలో ఉన్న తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టిఎఎఫ్ఆర్ సి) కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా జరిపారు.  
ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు,  కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, విద్యారంగంలో పెరుగుతున్న ఫీజుల భారంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు.  కార్పొరేట్ విద్యాసంస్థలు నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించి, ఫీజుల నియంత్రణ విషయంలో కఠిన చర్యలు చేపట్టి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.  విద్య హక్కుగా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం,నియంత్రణ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షలు గణేష్ కుండే స్పష్టం చేశారు.  
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి విద్య హక్కు చట్టం, పీజుల నియంత్రణ చట్టం అమలు చేసే  వరకు బీజేవైఎం పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హరీశ్వర్ రెడ్డి ,రాష్ట్ర ఉపాధ్యక్షలు ప్రవీణ్ రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్ నందకర్, శరత్ చంద్ర, సాయినాథ్, రాష్ట్ర కార్యదర్శలు శివచంద్రగిరి, అరవింద్ రెడ్డి, హరిప్రసాద్, వరప్రసాద్ రెడ్డి, ఝాన్సీ, రాష్ట్ర కోశాధికారి నరేన్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు