తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చెంజర్ గా బుల్లెట్ రైళ్లు 

తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చెంజర్ గా బుల్లెట్ రైళ్లు 
దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లలో మూడు తెలంగాణాకు రాబోతున్నాయని చెబుతూ  అవి తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చెంజర్ కాబోతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బుల్లెట్ ట్రైన్ల ద్వారా రూ.5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలిపారు. ఆదివారం సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభిస్తూ ట్రిపుల్ ఆర్‌కు సంబంధించి త్వరలోనే ప్రధాని మోదీ శుభవార్త చెబుతారని చెప్పారు.

2047 నాటికి దేశం 5 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని వివరించారు. ప్రయాణికుల రద్దీ సమయాల్లో ఇక్కడి నుంచి అదనపు రైళ్లు నడుపుతామని పేర్కొన్నారు. ఇది ఓ చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ రెండేళ్లలో ఈ స్టేషన్ నిర్మించి స్వామి వారి సన్నిధిలో భక్తులకు అంకితం చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ నుంచి కేవలం రూ.20తో ఇక్కడికి రావచ్చని కేంద్ర మంత్రి చప్పారు. ప్రస్తుతం రైళ్లు డీజిల్‌తో నడుస్తున్నాయని, త్వరలో ఈ లైన్‌ను రూ.300 కోట్లతో విద్యుద్దీకరిస్తామని ప్రకటించారు. ఈ రైల్వేస్టేషన్ నుంచి దేవాలయం వరకు షటిల్ సర్వీస్ బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ రైల్వేస్టేషన్ వల్ల ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగం అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది డిసెంబర్ 31 తేదీలోపు సిరిసిల్లకు రైలు సర్వీస్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది వేములవాడ అలాగే 2029లోపు కొత్తపల్లి వరకు ఈ రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నుంచి యదాద్రి వరకు రూ.500 కోట్లతో ఎంఎంటీఎస్ రైలు పనులు జరగనున్నాయని వివరించారు. అందుకోసం త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. 

రూ.3,500 కోట్లతో పాండురంగాపురం, భద్రాచలం పనులు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణలో ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వివరించారు. ఇప్పటికే ఐదు వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చామని గుర్తు చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, దీనిని వచ్చే ఏడాది ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు రఘునందన్ రావు, డా. కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.   కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి, తొలి ప్రయాణికుడిగా రైలు ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు.