ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు సంబంధించిన లైంగిక నేరాలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో రెట్టింపునకు పైగా ఈ నేరాలు నమోదయ్యాయని వెల్లడించింది. బాలికలు, మహిళలనే అధికంగా లక్ష్యంగా చేసుకుని సాగే ఈ నేరాలు అత్యంత క్రూరత్వంతో కూడుకున్నవని పేర్కొంది.
2025లో లైంగిక హింసకు సంబంధించి మొత్తంగా 9,788 కేసులు నమోదయ్యాయి. 2024లో వీటి సంఖ్య 4,617గా వుంది.
అంటే ఏడాది కాలంలో రెట్టింపునకు పైగా పెరిగాయని నివేదిక తెలిపింది. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో లైంగిక హింసకు సంబంధించిన పూర్తి స్థాయి చిత్రంగా దీన్ని చూడరాదని నివేదిక పేర్కొంది. ఎందుకంటే యుద్ధాలు లేదా సంఘర్షణలు కొనసాగుతున్నంత కాలమూ మనకు కనిపించని రీతుల్లో, వివిధ స్థాయిలో అనేక ఉల్లంఘనలు వుంటాయని, చాలావరకు బయటకు రాని సంఘటనలు కూడా వుంటాయని, అభద్రతా భావం, కదలికలపై గల ఆంక్షలు, రిపోర్టింగ్‌కు, డాక్యుమెంటేషన్‌కు అవరోధాలు, అంతరాయాలు వీటన్నింటి కారణంగా పూర్తి స్థాయిలో అక్కడ జరిగేది బయట ప్రపంచానికి తెలియదని నివేదిక పేర్కొంది.
దీనికి తోడు బడ్జెట్ కోతలు కూడా కారణమవుతాయని, మహిళల రక్షణ, భద్రతలపై ప్రత్యేక సామర్ద్యాల్లో తరచుగా కోతలు విధిస్తూ వుంటారని పేర్కొంది. యుద్ధాలు, ఘర్షణలతో సతమతమవుతున్న 21 దేశాల్లోని పరిస్థితులపై అందిన సమాచారాన్ని ఐక్యరాజ్య సమితి నిర్ధారించి ఈ నివేదిక రూపొందించింది. ఈ నేరాలకు సంబంధించిన కేసుల జాబితాలో మొత్తంగా 77 పక్షాలను చేర్చారు.
వీటిల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర వర్గాలు వున్నాయి. కొత్తగా జాబితాలో చేరిన ప్రభుత్వ వర్గాల్లో ఇజ్రాయిల్, రష్యా సాయుధ, భద్రతా బలగాలు వున్నాయి. యుద్ధం ఎత్తుగడ, వేధింపులు, ఉగ్రవాదం, రాజకీయ అణచివేత వంటి కారణాలతో ఈ లైంగిక నేరాలు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఫలితంగా రాజకీయ, భద్రతా, మానవతా సంక్షోభాలు మరింత అధ్వాన్న స్థితికి చేరాయని తెలిపింది.
ప్రభుత్వేతర శక్తులు పౌరులను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, కిడ్నాప్‌లు, లైంగిక బానిసత్వం వంటి చర్యలకు పాల్పడ్డాయని తెలిపింది. నిర్వాసితులు, శరణార్ధులు, వలసలు వెళ్ళిన మహిళలు, బాలికలు ఇలాంటి ముప్పును తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా, రష్యా, ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో నిర్బంధాల్లోని మహిళలు ఈ పరిస్థితులను ప్రధానంగా ఎదుర్కొన్నారని నివేదిక పేర్కొంది.

More Stories
అణు కేంద్రాల వద్ద ల్యాంచ్ ప్యాడ్లు నిర్మిస్తున్న చైనా
బ్రెజిలియన్ ముఠాలను ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించిన అమెరికా
సుదీర్ఘ యుద్ధాలతో ఇజ్రాయిల్ ప్రజల్లో మానసిక సమస్యలు