ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు నుంచి బయలుదేరుతున్న ఒక సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో నలుగురు భారత పౌరులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) తెలిపిన వివరాల ప్రకారం, గినియా-బిస్సావు జెండా కలిగిన ‘ఎంవి గోల్డెన్ లియో’ నౌక, నల్ల సముద్ర ఓడరేవు నుంచి బయలుదేరుతుండగా జూలై 19 సాయంత్రం దానిపై దాడి జరిగింది.
ఈ నౌకలో ఐదుగురు భారత పౌరులతో సహా మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. గినియా-బిస్సావు జెండా కలిగిన ‘గోల్డెన్ లియో’ నౌకలో భారత్, సిరియాకు చెందిన సిబ్బంది ఉన్నారని, దానిపై మూడు రష్యన్ క్రూయిజ్ క్షిపణులు దాడి చేయడంతో మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ నావికాదళం టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
“అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నలుగురు భారత పౌరులు విషాదకరంగా ప్రాణాలు కోల్పోగా, మరొకరు విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉక్రెయిన్‌లోని మా మిషన్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు బాధితులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది,” అని ఎంఈఎ సోమవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మృతుల కుటుంబాలకు మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన నావికుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. “మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము మరియు గాయపడిన భారత పౌరుడు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము,” అని అది పేర్కొంది.
పౌర నౌకలపై దాడులకు వ్యతిరేకమని పునరుద్ఘాటిస్తూ, భారతదేశం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. “ఇలాంటి దాడులను భారతదేశం ఖండిస్తుంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం కలిగించడం, లేదా నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఏ విధంగానైనా ఆటంకం కలిగించడం ఖండించదగినదని, వీటిని నివారించాలని పునరుద్ఘాటిస్తుంది,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
గత వారం రష్యా జరిపిన దాడిలో ‘ఎంవి గోల్డెన్ లియో’ లక్ష్యంగా మారిన తర్వాత, దాని నుంచి పొగలు వస్తున్నట్లు చూపే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఆ దాడిలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 10 మంది మరణించారని పలు సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నప్పటికీ, ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి దీనిపై ఎటువంటి స్పష్టత లేదు.

More Stories
అమెరికాలో 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం
భారతీయులు ఇరాన్ ప్రయాణం వాయిదా వేసుకోవాలి
ఫిఫా సాకర్ మహా సంగ్రామంలో విశ్వవిజేతగా స్పెయిన్